వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌‌లో ఉప్పునూతల చేరిక


-    ఉప్పునూతల చేరికతో పార్టీకి మరింత బలం
-    వైయస్‌ఆర్ సీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి
-    పార్టీలో చేరిన ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, చామల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి

భువనగిరి (నల్లగొండ జిల్లా), 9 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ను నడిపిస్తోంది కార్యకర్తలేనని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. వైయస్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమన్నారు. భువనగిరి మండలం రాయగిరిలో ఆదివారంనాడు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, యువజన కాంగ్రె‌స్ జాతీయ మాజీ కార్యదర్శి చామల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి తమ అనుచరులతో కలిసి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌లో చేరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎందరికో రాజకీయ గురువైన ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, యువ నాయకుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరడం అభినందనీయమని, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. నల్లగొండ జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ బలోపేతం కావడానికి ఇది నాంది అన్నారు. ఉప్పునూతల వైయస్‌కు అత్యంత సన్నిహితుడని.. అలాంటి వైయస్‌ను సీఎం, మంత్రులు విమర్శిస్తుంటే తట్టుకోలేక వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌లో చేరారని తెలిపారు.

పరిపాలన గాడి తప్పింది:
వైయస్ ‌ఆకస్మిక మృతి తర్వాత రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని.. తర్వాతి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి విమర్శించారు. ‘ప్రస్తుత ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. కరెంటు లేదు.. ఉన్న కరెంటు తగ్గించారు.. ఇస్తున్న కరెంటుకు రేట్లు పెంచారు. నాగార్జునసాగర్ ఆయకట్టు వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా బీడు భూములుగా మారే పరిస్థితి వచ్చింది.‌ ముఖ్యమంత్రిగా వైయస్ సాధించిన 400 మెగావాట్ల విద్యు‌త్‌ను ఈ ముఖ్యమంత్రికి మహారాష్ట్రకు అప్పనంగా అప్పగించారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి’ అని చెప్పారు.

అనంతరం పార్టీ రీజినల్ కో‌ ఆర్డినేటర్ కేకే మహేందర్‌రెడ్డి, నటుడు విజయచంద‌ర్, పార్టీ జిల్లా పరిశీలకురాలు బాలమణెమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీన‌ర్ బీరవోలు సోమిరెడ్డి, ఎస్సీ సె‌ల్ రాష్ట్ర కన్వీన‌ర్ నల్లా సూర్యప్రకా‌ష్‌రావు, జిల్లా కో ఆర్డినేటర్ బండారు మోహ‌న్‌రెడ్డి, రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top