వైయస్ఆర్ ఆశయ సాధనే ధ్యేయం

చిలకలూరిపేట:

వైయస్ఆర్ ఆశయ సాధన దిశగా జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. టీడీపీ నుంచి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ముందుగా మర్రి రాజశేఖర్ ఇంటి నుంచి ద్విచక్రవాహనాలతో ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు, అభిమానులు పార్టీ కార్యాలయంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజశేఖర్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి  తామున్నామని మహానేత వైయస్ఆర్ భరోసా కల్పించారన్నారు. ప్రస్తుతం ప్రజలను పట్టించుకునే నాథుడే కరవయ్యాడన్నారు.  ప్రజా సమస్యల సాధనలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండటం వల్లనే అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ సూర్యుడి చుట్టూ తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులా రాష్ట్రంలో ప్రజలు జగన్ వెంట కదులుతున్నారని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే ఆ పార్టీ నాయకులు పరుగుయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్  పథకాలతో లబ్ధిపొందిన వారంతా రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకున్నా, అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదని ఆరోపించారు.

Back to Top