కరీంనగర్: విరిగిన అరటిచెట్లు... కుప్పుకూలిన బొప్పాయి... నీటిలో మునిగిన వరి... రాలిన మామిడి కాయలు... నేలకొరిగిన నువ్వులు... కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్ల వాన మిగిల్చిన దృశ్యాలివి. వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏ రైతును కదిలించినా కన్నీళ్లే రాలారుు. చేతికి రాబోయే పంట మట్టిపాలయ్యిందనే బాధ... పెట్టిన పెట్టుబడి తిరిగి రాదనే ఆవేదన...చేసిన అప్పులు తీర్చేదెలా అని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ బోరుమన్నారు. రైతుల దుస్థితిని చూసి చలించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని, పది రోజుల్లో ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ఈనెల 20 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ అకాల వర్షాల వల్ల తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టంపై చర్చిస్తామన్నారు. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నూటికి నూరుశాతం నష్టపరిహారం అందేలా ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. <strong>వానొచ్చి మా నోట్లో మట్టి కొట్టింది..</strong>కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ నేతలు తొలుత చొప్పదండి ని యోజకవర్గంలోని మల్యాల మండలం మానాల గ్రామానికి వెళ్లారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట చేలను పరిశీలించారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాసునోళ్ల గంగవ్వ అనే రైతు ‘మూడు ఎకరాల్లో అప్పు తెచ్చి వరి సాగు చేసిన. పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వానొచ్చి మానోట్ల మట్టి కొట్టింది. తెచ్చిన అప్పు తీర్చేదెట్లా...బతికేదెట్ల? బిడ్డల పెండ్లిండ్లు ఎట్లా చేయాలే...’ అని భోరున విలపించింది. అరు ఎకరాల్లో మామిడి, నువ్వుల పంట సాగుచేస్తే గాలివానకు మొత్తం నాశనమైందని కర్కల నర్సయ వాపోయారు. దాని గంగవ్వ మాట్లాడుతూ ‘సారూ..నా పుట్టుకతో గిసోంటి వానను సూల్లే... ఇంతింత లావు రాళ్లవాన. అర్ధరాత్రి, అపరాత్రి అని సూడకుం డా కరెంటు ఎప్పుడొస్తే అప్పుడు పోయి నీళ్లు పెట్టిన. లచ్చన్నర అప్పు జేసి పండించిన... తీరా చూస్తే పంటనంత దేవుడి తీసుకపాయే... నోట్లోకి నూకల్లేవాయే.. మేమెట్లా భరించేది దేవుడా...’ అని కన్నీటి పర్యంతమైంది.<strong> </strong><strong>మా బతుకే దండగ</strong>మానాల రైతులను ఓదార్చిన పొంగులేటి అటు నుంచి నేరుగా జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్‌గల్ రాయికల్ మండలం కిష్టంపేట గ్రామాల్లోని పంట పొలాలకు వెళ్లారు. రైతులతో మాట్లాడారు. బాడిశెట్టి లచ్చయ్య అనే రైతు నేలరాలిన నువ్వుల పంటను చూపిస్తూ ‘సార్...వాన రాకపోతే ఐదారు క్వింటాళ్ల నువ్వులు పండేటివి. వానొచ్చి ఎందుకూ పనికిరాకుండా చేసింది. ఎట్ల బతకాలో అర్ధం కాట్లే’ అని కంట తడిపెట్టారు. పెదాల చిన్నభూమయ్య, బక్కశెట్టి రాజిరెడ్డి, మగిశెట్టి లచ్చులను కదిలిస్తే ఇదే పరిస్థితి. ‘సర్కారోళ్ల సాయం చేయకుంటే ఇక మా చావడమే మేలు. మీరైనా న్యాయం చేయండి సారూ..’ అని బోరుమన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ అండగా నూటికి నూరుశాతం సాయం అందేలా చూస్తామని భరోసా ఇస్తూ వారి కన్నీళ్లను తూడ్చే ప్రయత్నం చేశారు. <strong>పక్షికున్న ఆధారమైనా లేకపోయే!</strong>కిష్టంపేట నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి వచ్చిన పొంగులేటి బృందం కట్లకుంట, తొంబర్రావుపేట గ్రామాల్లోని పంట పొలాల్లోకి వెళ్లారు. ఆ ప్రాంతాల్లో కూలిన అరటి, బొప్పాయి చెట్టు, నేలకొరిగిన నువ్వులు, నేలపాలైన మామిడి కాయలను పరిశీలించారు. విరిగిన అరటిచెట్లను పొంగులేటికి చూపిస్తూ రైతులు యార్ల రాజిరెడ్డి, మహేష్ ‘మందులు, స్ప్రేలకు లక్ష రూపాయలు ఖర్చుపెట్టినం. ఈ ఏడాది బాగా కాపుకొచ్చినయ్... ఖర్చులుపోను రెండు లక్షల దాకా లాభమొస్తదని ఆశపడ్డం... తీరాచూస్తే అరటి చెట్లన్నీ కళ్లముందే కూలిపాయే... మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తరు? సర్కారోళ్లేమో ‘రైతే రాజు’ అంటరు... కానీ ఆకాశంలో పక్షికి ఉన్న ఆధారం కూడా మాకు లేకపాయే’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పర్యటనలో పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాష్‌రావు, గాదె నిరంజన్‌రెడ్డి, మతిన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్మ రవీందర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ప్రచార కమిటీ నాయకుడు పెద్ద పట్లోళ్ల సిద్ధార్ధరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాస్, కె.వెంకటరెడ్డి, జి.ధనల క్ష్మీ, అక్కినపల్లి కుమార్, విలియం మునగాల, సంయుక్త కార్యదర్శి డాక్టర్ నగేష్‌తోపాటు పార్టీ నేతలు గూడూరు జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కళ్యాణ్, కిషన్, ఎన్.రఘు, కట్ట శివకుమార్, మోకినిపల్లి రాజమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.