కాలయాపన చేస్తున్నారు గనుకే ..!

విలువలు పాటించని చంద్రబాబు..!
హోదా ఇవ్వమని ప్రధానిని కోరతాం..!

ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీలు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా ప్రకటించాయని...చంద్రబాబయితే హోదా పదేళ్లు కాదు 15 సంవత్సరాలు కావాలని అడిగారని ఈసందర్భంగా గుర్తుచేశారు. కానీ ఇవాళ  ఒక్కో నాయకుడు ఒక్కో ప్రకటన చేస్తూ హోదాపైనీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈపరిస్థితుల నేపథ్యంలోనే ఢిల్లీలో ధర్నా, రాష్ట్ర బంద్ లు చేపట్టామన్నారు. ఏడు రోజుల పాటు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారన్నారు.

ప్రత్యేకహోదాను కోరతాం..!
రాష్ట్రానికి ప్రత్యేకహోదాను కోరేందుకు ప్రధానమంత్రి అపాయిట్ మెంట్ కోరినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. ఈనెల 22న  మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ..రాష్ట్ర ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షను వివరిస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కలుస్తామని చెప్పడం జరిగిందని.. ప్రధాన మంత్రికి వీలైన ప్రదేశంలో ఎక్కడైనా కొద్దిసేపు  సమయం కేటాయించాలని కోరామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులను మోడీకి తెలియజెప్పి తక్షణమే ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరతామన్నారు. 

కనీస విలువలు పాటించడం లేదు..!
రాజధాని శంకుస్థాపన కోసం  పొరుగు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ను స్వయంగా పిలుస్తానని చెప్పిన చంద్రబాబు..రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి మాత్రం ప్రోటోకాల్ ప్రకారం కనీస విలువలు పాటించడం లేదన్నారు.  రాజధాని భూమిపూజ సహా అక్కడ ఏకార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాన్ని పిలిచిన దాఖలాలు లేవన్నారు ఉమ్మారెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకొని సింగపూర్ చేతిల్లో పెట్టి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాంటి  వివాదాస్పద స్థలంలో నిర్వహించే కార్యక్రమానికి తాము రాలేమన్నారు.  ఈపరిణామాలన్నంటినీ మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఒకవేళ ప్రధాని రాష్ట్రానికి రాని పక్షంలో తామే ఢిల్లీకి వెళ్లి పరిస్థితిని వివరిస్తామన్నారు. 
Back to Top