వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు


హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో‌ శుక్రవారం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఓ మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు విజ్ఞా‌న్ సంస్థల అధినేత లావు రత్తయ్య చేరారు.‌ విజయనగరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు‌ నాయుడు, లావు రత్తయ్య, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కె.జయచంద్రనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్‌ను ఆయన నివాసంలో వేర్వేరు సమయాల్లో కలిసి పార్టీలో చేరారు. వారికి శ్రీ జగన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుజ‌య్‌ కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వైయస్‌ జగన్ నేతృత్వంలోనే సీమాంధ్ర అభివృద్ధి :
శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోనే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లా‌డారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం శ్రీ జగన్‌ ఒక్కరికే సాధ్యమన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇది తేటతెల్లమైందని చెప్పారు. కాంగ్రె‌స్‌కు ఓటేయాలని ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు ‘మీరు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌లో చేరితే బాగుంటుంది’ అని సూచించారన్నారు. తమ కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు.

ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ ఇస్తానన్నారు :
సీఎం కాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి పీఆర్సీ ఇస్తానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన తండ్రి, మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ మాదిరిగానే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని‌ శ్రీ జగన్ తనతో చెప్పారన్నారు. కాంట్రాక్టు, ‌ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తానన్నారని తెలిపారు.‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ‌ వర్గాలతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, తమకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆయన నెరవేర్చారని గాదె తెలిపారు. శ్రీ జగన్ కూడా అదే విధంగా చేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

చంద్రబాబు శరీరంలో సగం కాంగ్రెస్ రక్త‌మే :
చంద్రబాబు నాయుడి శరీరంలో ప్రవహిస్తున్న రక్తంలో సగం కాంగ్రెస్‌దని, మరో 30 శాతం బీజేపీదైతే మిగతా 20 శాతమే టీడీపీదని విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య విమర్శించారు. టీడీపీ ప్రస్తుతం సహజత్వాన్ని కోల్పోయింద‌న్నారు. వైయస్ఆర్‌సీపీలో చేరిన అనంతరం ఆయన సీజీసీ సభ్యురాలు లక్ష్మీపార్వతితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న చివరి దశలో తాను టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, పార్టీకి అన్ని విధాలా మద్దతు తెలిపేందుకే వచ్చానని చెప్పారు.‌ సీమాంధ్రకు దృఢమైన నాయకత్వం కావాలని, అది ఒక్క శ్రీ జగన్‌కే సాధ్యమని చెప్పారు.

బాబు హయాంలో దిగజారిపోయిన రాష్ట్రం :
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంతో దిగజారిపోయిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అప్పటివరకూ రూ.3 వేల కోట్ల అప్పుంటే, చంద్రబాబు దానిని రూ.36 వేల కోట్లకు తీసుకువెళ్లారన్నారు. కళాశాలల్లో పేదలు చదువుకోనీయకుండా చేశారని, మద్యపాన నిషేధం ఎత్తేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయని, విద్యుత్ సమస్యలూ ఎక్కువయ్యాయన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని, వై‌యస్ఆర్‌సీపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం కొత్త నాయకత్వం కావాలని, అది శ్రీ జగన్‌కే సాధ్యమన్నారు.

Back to Top