రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా

పార్లమెంట్ లో తన వంతు పాత్ర పోషిస్తా
సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా
అధ్యక్షులు, పార్టీ నాయకుల సూచనల మేరకు నడుచుకుంటా
టీడీపీ రెండేళ్ల పాలన పూర్తిగా వైఫల్యం
హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుంది
రాజ్యసభ ఎంపీగా ధృవీకరణ పత్రం అందుకున్న సాయిరెడ్డి

హైదరాబాద్ః  రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో చిత్తశుద్ధితో పనిచేస్తానని వైయస్సార్సీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, పార్టీ పార్లమెంటరీ నాయకుల సూచనలు, సలహాల మేరకు తన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ నాయకత్వంలో రెండేళ్లుగా పోరాడుతున్నామని, ఇకపైనా పోరాటం కొనసాగుతుందని విజయసాయిరెడ్డి తెలియజేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం ఈరెండేళ్లలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పారు. ప్రభుత్వ మోసాలపై  పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఈనెల 14న సమావేశమై నిర్ణయిస్తామన్నారు. అదేవిధంగా జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని గడపగడపకు వైయస్సార్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 


రాజ్యసభలో ఏకైక సభ్యునిగా అద్భుతాలు సృష్టిస్తానని ప్రగల్భాలు పలకను గానీ, ఏమాత్రం అధైర్య పడకుండా రాష్ట్ర సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషిచేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. రెండేళ్లుగా పార్టీకి ఏవిధంగా పనిచేస్తూ వచ్చానో...భవిష్యత్తులోనూ ఎలాంటి అశ్రద్ధ వహించకుండా, ఎన్నికలకు సంసిద్ధమయ్యేలా పనిచేస్తానన్నారు. పార్లమెంట్ లో తన వంతు పాత్ర పోషించి ఆరు సంవత్సరాల సభా కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటానని ఆశిస్తున్నానన్నారు.  


ఈ ఊదయం అసెంబ్లీకి చేరుకున్న విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికైన ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.  ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నఅసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ  నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. కాగా వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలి ఎంపీగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు.
Back to Top