'టిడిపిని డ్రామా కంపెనీగా మార్చిన చంద్రబాబు'

కర్నూలు, 9 డిసెంబర్‌ 2012 : చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని ఓ డ్రామా కంపెనీగా మార్చేశారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. లక్షలాది మంది చిల్లర వ్యాపారులను వీధిన పడేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఓటింగ్‌ జరిగినప్పుడు తమ సభ్యులకు పార్టీ విప్ ఎందుకు జారీ చేయలేదో చంద్రబాబు చెప్పాలని శో‌భా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఓటింగ్‌ సందర్భంగా టిడిపి సభ్యులను రాజ్యసభ నుంచి గైర్హాజర్‌ చేయించడానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో చేసుకున్న చీకటి ఒప్పందం ఏమిటని ఆమె నిలదీశారు. ఎల్లోమీడియా, పత్రికలు చంద్రబాబు గరం గరం అని పైపైకి ప్రచారం చేస్తున్నాయని, అసలు ఓటింగ్‌లో టిడిపి విధానం స్పష్టం చేయాలని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. ఆళ్ళగడ్డలో ఆమె ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడారు.

రాజ్యసభలో ఎఫ్‌డిఐలపై కీలక ఓటింగ్ సమయంలో ముగ్గురు ‌టిడిపి ఎంపిలు చంద్రబాబుకు చెప్పకుండా గైర్హాజరయ్యారంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని, కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ తప్ప మరోకటి కాదని విమర్శించారు. సిబిఐ విచారణ నుంచి తనను తప్పించుకోవడం, సొంత కంపెనీ హెరిటేజ్‌లో లాభాలు పొందడం, శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైలులోనే ఉంచడం అనే మూడు ఒప్పందాలకు లోబడే చంద్రబాబు ముగ్గురు ఎంపిలను ఓటింగ్‌కు దూరంగా ఉంచారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు.

ఓటింగ్‌కు గైర్హాజరుపై ముగ్గురు టిడిపి ఎంపిలు చెబుతున్న కారణాలు స్కూలుకు డుమ్మా కొట్టిన పిల్లలు చెప్పే సాకుల్లా ఉన్నాయని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యసభలో పార్టీ నాయకుడు దేవేందర్‌గౌడ్, వి‌ప్ గుండు సుధారాణి,‌ చంద్రబాబుకు అన్నీ తానే అని చెప్పుకునే ఉప నాయకుడు సుజనాచౌదరి ఓటింగ్‌లో పాల్గొనలేదంటే.. ఎఫ్‌డిఐలపై టిడిపి ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్‌తో ముందస్తు ఒప్పందం బహిర్గతమయ్యాయని అన్నారు. చంద్రబాబుకు తెలిసే ముగ్గురు ఎంపిలు ఓటింగ్‌కు గైర్హాజరైనట్లయితే.. చంద్రబాబు తన పాదయాత్రకు ఫుల్‌స్టాప్ పెట్టి కాంగ్రె‌స్ పొత్తుతో 2014 ఎన్నికల్లో పోటీ చేయాలని శోభానాగిరెడ్డి సూచించారు. ఒకవేళ తనకు తెలియకుండానే జరిగితే ముగ్గురు ఎం‌పిలను సస్పెండ్ చేసి ‌చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఒక వైపున తమ పార్టీ ఎంపిలను ఓటింగ్‌కు గైర్హాజరవమని చెప్పి మరో వైపున సొంత పార్టీ నాయకులతోనే వారిపై విమర్శలు చేయిస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. తమ అధినేతకు చెప్పి ఓటింగ్‌కు గైర్హాజరైనట్టు దేవేందర్‌గౌడ్ చెప్పడంతోనే చంద్రబాబు ద్వంద్వనీతి బయట పడిందన్నారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపే విషయంలోనూ టిడిపి డ్రామా నడిపిందని ఆమె విమర్శించారు. ఓటింగ్ సమయంలో ‌టిడిపి ఎమ్మెల్యేలు సభలో నామమాత్రంగా ఉండడాన్నిబట్టే బాబుకు సబ్‌ప్లాన్‌పై ఉన్న చిత్తశుద్ధి బయటపడిందన్నారు. సబ్‌డివిజన్ ‌వంకతో ఆ పార్టీ అసెంబ్లీలో డ్రామా ఆడిందన్నారు. రాష్ట్రప్రభుత్వంపై అవిశ్వాసం విషయంలోనూ ఇదే డ్రామా సాగిందన్నారు.
Back to Top