వైఎస్సార్‌సీపీలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, నాయకుల కోలాహలం నడుమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదైన  సందర్భంగా కార్యకర్తలు తెచ్చిన భారీ కేక్‌ను ఆయన క ట్ చేశారు. కార్యకర్తలకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయం బయట పెద్ద ఎత్తున బాణసంచాను పేల్చి కార్యకర్తలు సందడి చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

జై తెలంగాణ, జై వైఎస్సార్‌సీపీ అంటూ.. కార్యకర్తల నినాదాలతో కార్యాలయ ప్రాంగణం హోరెత్తింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివకుమార్, శ్రీకాంత్‌రెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర నాయకులు విజయ్‌చందర్, మతిన్, భిక్షపతి, రవీందర్, రఘురాంరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, జార్జి హెర్బెట్, శివాజీ, ఎస్‌కె మాసుం, రంగారెడ్డి జిల్లా నాయకులు సురేశ్‌రెడ్డి, రవికుమార్, నాగరాజు, శ్రీనివాసరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా విభాగ నాయకులు వనజ, శోభ, శ్యామల, ప్రియ, విజయలక్ష్మి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Back to Top