తెలంగాణ ప్రాంతమంటే రాజన్నకు అమితాభిమానం

మహబూబ్‌నగర్:

మీ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని గుర్తుంచుకోండి మంత్రిగారూ! అంటూ మహానేత కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల గుర్తుచేశారు. గద్వాల నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదంటే అవమానంగా  లేదా అని ప్రశ్నించారు. పదవి కాపాడుకోవాలనే శ్రద్ధ తాగునీటి పథకాలపై పెట్టి ఉంటే సమస్య తలెత్తేది  కాదన్నారు. మీరు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె దుయ్యబట్టారు.

     మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా షర్మిల మంగళవారం గద్వాల నియోజకవర్గంలోని గ్రామాల్లో పాదయాత్ర చేశారు. మహిళలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ టీఆర్‌యస్ పార్టీ ప్రజా సమస్యలపై ఏనాడూ పోరాడలేదన్నారు. తెలంగాణ అంటే వైయస్ రాజశేఖరరెడ్డికి ప్రేమలేదని కేసీఆర్ విమర్శించడాన్ని తప్పుపట్టారు.

ప్రాణహితే వైయస్ ప్రేమకు తార్కాణం

     ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ 16 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తలపెట్టడమే తెలంగాణపై వైయస్ అభిమానానికి తార్కాణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎందుకు సాహసం చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.700 కోట్లు ఖర్చుచేస్తే అదే వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.25 వేల కోట్లు ఖర్చుచేశారనీ,  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.7000 కోట్లు మాత్రమే  ఖర్చుచేసిందనీ గణాంకాలతో వివరించారు. వీటిని బట్టి చూస్తే తెలంగాణ ప్రాంతంపై ఎవరికి ఎంతప్రేమ ఉందో అర్థంచేసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు.

నేతన్నల బాగుకోసం జగనన్న దీక్ష
     రాజన్న, జగనన్నకు చేనేతలంటే ప్రత్యేక గౌరవమని ఈ సందర్భంగా షర్మిల గుర్తుచేశారు. అందుకే వారి బాగోగులకోసం జగనన్న చేనేత దీక్షలు చేపట్టాడన్నారు. బాబు హయాంలో ఆప్కోలను మూసివేస్తే గిట్టుబాటు ధర లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు ఇచ్చాడన్నారు. చేనేత రుణమాఫీ కోసం వైఎస్ రూ.312 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్కో ఈత చెట్టుకు రూ.500 పన్ను వసూలు చేసేవారని, వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.25కు చేసి గీత కార్మికులను ఆదుకున్నారని వివరించారు.

నీళ్లివ్వలేని స్థితిలో నెట్టెంపాడు
     నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 25 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని మొదట్లో చంద్రబాబు నాయుడు నిర్ణయించగా.. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు కింద రెండు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు కృషిచేసి రూ.1200 కోట్లు ఖర్చుచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

     వైయస్ హయాంలో 75 శాతం పనులు పూర్తిచేయగా..25 శాతం పనులు పూర్తిచేయడానికి మూడేళ్ల సమయం కూడా చాలడం లేదన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రారంభించినా వెయ్యి ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని షర్మిల విమర్శించారు. తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి 180 గ్రామాలను కలుపుతూ పైప్‌లైన్ వేయడానికి  రాజశేఖర్‌రెడ్డి రూ.100 కోట్లు కేటాయిస్తే మూడేళ్లైనా ఈ ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేకపోయిందన్నారు. వైయస్ పథకాలన్నీ ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

గద్వాల జనసంద్రం

     గద్వాలలో బహిరంగ సభ ఉందని తెలిసి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం నుంచే లారీలు, జీపులు, ఆటోలు, దూరప్రాంతాల నుంచి బస్సుల్లో వేలాదిమంది గద్వాలకు తరలొచ్చారు. దీంతో పట్టణవీధులన్నీ జనసంద్రమయ్యాయి. అంతకుముందు పెద్దఎత్తున డప్పు వాయిద్యాలు, గుర్రాల ర్యాలీతో షర్మిలకు ఘన స్వాగతం పలికారు.

Back to Top