తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం సాధ్యం కాదు



హైదరాబాద్ : అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో మోజార్టీ సభ్యులు సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలేననీ,  ఈ నేపథ్యంలో  తీర్మానం చేసినా వీగిపోవటం ఖాయమనీ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అప్పటివరకూ వేచి ఉండాలని ఆయన కోరారు.  ముఖ్యమంత్రి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని భరించే స్థితిలో లేదని ఖరాఖండిగా చెప్పారు. ఏడాదికి ఓ కుటుంబానికి ఆరు గ్యాస్ సిలిండర్లు సరిపోతాయన్నారు. ఎగువ నుంచి నీరు వస్తేనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేది లేదని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. చట్టపరిథి దాటితే ఎంతటివారినైనా సహించేది లేదని హెచ్చరించారు. కోదండరామ్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని, సీఎం మార్పు మహారాష్ట్రకు సంబంధించిదని ఆయన పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.


Back to Top