తెలంగాణకు పరిష్కారం కోరిన వైయస్ఆర్ కాంగ్రెస్

న్యూఢిల్లీ, 28 డిసెంబర్ 2012:

తెలంగాణ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మాజీ ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి తెలిపారు. తెలంగాణపై ఎన్ని పార్టీలు ఏమీ చెప్పినా ప్రయోజనం లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజనపై సర్వాధికారాలు కేంద్రానివేనన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నఅనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

     కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ఇప్పటికైనా అన్ని విషయాలు, అన్ని సమస్యలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందన్నారు. ఈ సమస్యకు ఓ తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చూపాలంటూ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేఖ ఇచ్చినట్టు మైసూరారెడ్డి చెప్పారు.

Back to Top