శ్రీశైలం వివాదంలో టీడీపీ, టీఆర్ఎస్ దోషులే

హైదరాబాద్, అక్టోబర్ 31: శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పడిపోవడంలో తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వ పాపమూ ఉందని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి దుయ్యబట్టారు. రాయలసీమకు కేటాయించిన నికర జలాలు వచ్చేలా చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 854 అడుగుల దిగివకు పడిపోతే రాయలసీమకు నీటి విడుదల సాధ్యం కాదని తెలిసీ.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల నుంచి 860 అడుగులకు పడిపోయేంతగా ఏపీ ప్రభుత్వం తెలంగాణతో పాటు విద్యుదుత్పత్తి చేసిందన్నారు.

ప్రాజెక్టు నీటిమట్టం 860 అడుగులకు చేరుకున్న తర్వాత అక్టోబర్ 18న శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు. అయితే ఆ తర్వాత 21 వరకు అనధికారంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మైసూరా మాట్లాడారు. 'గత అనుభవాలను బట్టి చూస్తే.. వరద నీరుతో పాటు ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగుల నుంచి 860 అడుగులకు రావడానికి కనీసం మూడు నెలలైనా పడుతుంది. అలాంటిది కేవలం 15 రోజుల్లోనే రెండు ప్రభుత్వాలు చెరో పక్క ఎడాపెడా నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడి ప్రాజెక్టును ఖాళీ చేశాయి.

నీటిమట్టం 860 అడుగులకు పడిపోయిన తర్వాతే చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమ తాగునీటి అవసరాలు గుర్తుకొచ్చాయి. నీరు తరిగిపోతుంటే ఏమీ ఆలోచన లేకుండా నష్టం జరిగాక హడావుడి చేయడం రాయలసీమ హక్కులను హరించడం కిందికి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అక్టోబర్ మొదటివారంలో కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు రెండు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఆ సమయంలో సీమ అవసరాలు తీర్చాలంటే 854 అడుగుల నీటి  మట్టాన్ని కాపాడాలనే అంశాన్ని ఏపీ ప్రభుత్వ ఇంజనీర్లు కనీసంగా కూడా ప్రస్తావించలేదు.. అని దుయ్యబట్టారు.

శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంచాలని ప్రాజెక్టు రూపకల్పన నివేదికలోనే ఉందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అంజయ్య ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్పిల్ లెవల్ 840 అడుగులుగా పెట్టి శంకుస్థాపన చేసిందని తెలిపారు. ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాల్సిన అవసరంపై బచావత్ ట్రిబ్యునల్ లో కూడా చర్చించారని వివరించారు.

వీళ్లా సీమ ప్రయోజనాలు కాపాడేది?

రాయలసీమ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్న మాటలన్నీ చిత్తశుద్ధి లేనివేనని మైసూరా రెడ్డి విమర్శించారు. జరగాల్సిన నష్టం జరిగాక రాజకీయ ప్రయోజనాల్ కోసం ఇప్పుడు కోర్టులు, ట్రిబ్యునల్ అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. ఈ ఏడాది ఏగువ రాష్ట్రాల్లో కురుసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద వచ్చినపుడు వరదనీరు వృధాగా సముద్రంలోకి పోకుండా రాయలసీమకు నీటిని విడుదల చేద్దామని ఇంజనీర్లు చెప్పినా ప్రభుత్వం అంగీకరించలేదని గుర్తుచేశారు. నీరు సముద్రంలోకి పోతున్న సమయంలోనూ పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడానికి ససేమీరా అంగీకరించని వ్యక్తి ఇప్పటి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ అని దుయ్యబట్టారు.

నీరు సముద్రంలోకి వృధాగా పోవడానికైనా సరే అంగీకరించి, సీమకు నీటి విడుదలకు ఒప్పుకోని వారు ఇప్పుడు సీమ ప్రయోజనాలు కాపాడుతామంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. 'వాస్తవానికి డిసెంబర్ 30 వరకు ఎస్సార్బీసీకి నీళ్లు ఇవ్వాలి. కేసీ కెనాల్ కు 5 టీఎంసీల అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే చుక్క నీరు ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు' అని అన్నారు. శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని(ఎండీడీఎల్) 854 నుంచి 834 అడుగులుగా కుదించిన పాపమూ టీడీపీదేనని దుయ్యబట్టారు.

ఇందుకు సంబంధించి 69 జీవోను 1996లో చంద్రబాబే జారీ చేశారన్నారు. ఎండీడీఎల్ 854 అడుగులకు పునరుద్ధరించాలని సీమ ఎమ్మేల్యేలు తీర్మానం చేస్తే.. ఈ మేరకు అప్పటి సీఎం చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించడానికి ఎస్వీ సుబ్బారెడ్డి తనను ఎంపిక చేశారని, అయితే ఆ విజ్ణప్తిని చంద్రబాబు చెవికి ఎక్కించుకోలేదన్నారు.

తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ అఖిలపక్షం ఏర్పాటు చేసి, ఎండీడీఎల్ 854 అడుగులకు పునరుద్ధరిస్తూ జీవో 107 జారీ చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో జీవోకు వ్యతిరేకంగా ఇప్పటి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా బ్యారేజీపై ధర్నా నిర్వహించారన్నారు. కిరణ్ కుమార్ రెడ్ది సీఎంగా ఉన్న సమయంలో గండికోటకు తాగునీటికి, ఆర్టీపీపీ అవసరాలకు 2 టీఎంసీల వరద నీటిని ఇస్తేనే నానా యాగీ చేసిన వ్యక్తి దేవినేని అని గుర్తు చేశారు.

రేపు ప్రాజెక్టు సందర్శనకు వైసీపీ ఎమ్మెల్యేలు

వాస్తవాలు బహిర్గతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నట్టు చెప్పారు. 

Back to Top