సొంత పనుల కోసమే సింగపూరు యాత్ర

హైదరాబాద్, నవంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లింది తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత మాత్రం కాదని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కొత్త రాజధాని నిర్మాణానికి ఓ వైపు చందాలడుగుతున్నారు... మరోవైపు హుద్-హుద్ తుపానుకు విలవిల్లాడిన విశాఖపట్టణం అభివృద్దికి నిధుల కొరత ఉందటున్నారు... ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక విమానాల్లో ఖరీదైన సింగపూర్ యాత్ర చేయాల్సిన అవసరముందా? ఇది దుబారా కాక మరేమిటి?' అని ఆయన నిలదీశారు.

'సౌత్ ఆసియన్ స్టడీస్' సంస్థ వార్షికోత్సవంలో ప్రసంగించడానికి వారి ఆహ్వానం మేరకు చంద్రబాబు వెళుతున్నట్లు చెబుతున్నారని, ఈ సంస్థకు స్థానికంగా కూడా అంత ప్రాచుర్యం లేదని అన్నారు. అలాంటి వారి ఆహ్వానం మేరకు 'రాజు వెడలె రవి తేజములలరగ, కుడి ఎడమల్ డాల్ కత్తుల్ మెరియగ..' అన్నట్లుగా చంద్రబాబు తనకిష్టులైన మంత్రులు, ఉన్నతాధికారులను, వ్యాపారవేత్తలను వెంట తీసుకుని రెండు ప్రత్యేక అద్దె విమానాల్లో సింగపూర్ వెళ్లాల్సిన అవసరం ఉందా? అని విస్మయం వ్యక్తం చేశారు.

ఒక విమానానికి అడ్వాన్సుగా అద్దె కింద రూ. 70 లక్షలు ఇప్పటికే చెల్లించారని, మొత్తం పర్యటనకు మరిన్ని కోట్లు అవుతాయన్నారు. ఈ పర్యటనకు అయ్యే నిధులతో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి గాని, హుద్-హుద్ సహాయక చర్యల కోసం గాని ఖర్చు పెట్టొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

సింగపూర్ నగరంలో చంద్రబాబుకు వ్యాపారాలు..

చంద్రబాబుకు, సింగపూర్ నగరానికి అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో ఉందని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా జిల్లాల్లో తిరుగుతూ ఉంటే సింగపూర్ నగరంలో చక్కర్లు కొట్టిన ఘనత చంద్రబాబుదని అంబటి అన్నారు. చంద్రబాబు వ్యాపారాలు చేసుకునేది, హోటళ్లు నిర్మించుకునేది సింగపూర్ నగరంలోనే అని, ఇది తాను చెప్పేది కాదని, 'తెహల్కా డాట్ కామ్' వారే చెప్పారని అన్నారు. వైఎస్ కుమారుడైన జగన్ తన పత్రికను, వ్యాపారాలను ఏపీలోనే చేసుకుంటున్నారని, కానీ చంద్రబాబు కొడుకు, కోడలు, ఇతర వంధిమాగదులు వ్యాపారాలు చేసేది సింగపూర్ లోనే అని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే మంచిదనే చర్చ మేధావుల్లో జరుగుతుందని అన్నారు.

మనీ ల్యాండరింగ్ కేంద్రంగా సింగపూర్..

చంద్రబాబు సింగపూర్ నగరంలో ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా వేయవలసిందిగా 'రా' సంస్థను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సింగపూర్ నగరంతో పాటు, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దావోస్ నగరానికి కూడా వెళ్లేవారని, ఆయన బంధువులు, స్నేహితులు మనీల్యాండరింగ్, వ్యాపారాలకు సింగపూర్ నగరాన్ని ఒక కేంద్రంగా పెట్టుకున్నారని అన్నారు.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగస్వామ్య సదస్సులను అట్టహాసంగా నిర్వహించి వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వస్తున్నట్లు ప్రచారార్భాటం చేశారని, ఆ తరువాత ఒక్క పెద్ద ప్రాజెక్టు గాని,    ఒక్క గ్రీన్ ప్రాజెక్టు గాని రాలేదని అంబటి అన్నారు. హీరో-హోండా సంస్థను తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు ఆ సంస్థకు ఏపీలో వ్యాట్ లేకుండా చేశారని, అంతే కాదు, పొరుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ అమ్మకాలపై వేసే వ్యాట్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయాలు తీసుకుని ఇక్కడి ప్రజలపై విద్యుత్, ఆర్టీసీ చార్జీల భారం మోపి ఆయా రాష్ట్రాలకు చెల్లించారని అంబటి గుర్తుచేశారు.

తాజా వీడియోలు

Back to Top