హామీలకు తూట్లు పొడిచిన సర్కార్ప్రజాసమస్యలను గాలికొదిలి సొంత లబ్ది కోసం ఆరాటం
హైదరాబాద్ః చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కహామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఫైరయ్యారు. ఇంటికో ఉద్యోగం , ఉద్యోగం లేని వారికి నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. గిరిజన ప్రాంతాల్లోని బ్యాక్ లాగ్ పోస్ట్ ల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ లు ఇస్తున్నామని సంబంధిత మంత్రి చెప్పడం దారుణమన్నారు. మహిళలు పింఛన్ కోస పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఆమెకు తెలియదేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అడ్డగోలుగా పెన్షన్లు కత్తిరిస్తున్నారని, జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి ప్రజలు పెన్షన్ అడుక్కోవాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
మంత్రి రావెల రాజీనామా చేయాలిగిరిజన మంత్రిగా రావెల కిషోర్ బాబు ఉండడం వల్ల గిరిజనులకు జరిగిన మేలు ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తూ గిరిజనులకు సంబంధించిన పథకాలను దిగజార్చే కార్యక్రమాలు చేపడుతుందని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులను నియమించాలనే నిబంధన ఉంటే... వాటిని తుంగలో తొక్కి, డిప్యూటీ అధికారులను కేటాయించి ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద సింగిల్ లైన్ అడ్మినిస్టేటర్‌గా ఐఏఎస్ అధికారులను నియమించాలని జీవో ఉన్నప్పటికీ, వాటిని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. గత అసెంబ్లీలో అధికారులను కేటాయిస్తామని చెప్పిన మంత్రి రావెల కిషోర్ వాటిని విస్మరించడం సిగ్గు చేటన్నారు. గిరిజనులకు మేలు చేయని రావెల కిషోర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న టీడీపీ సర్కార్రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో ఫించన్ల పథకం పెట్టి ...పచ్చచొక్కాల నాయకులకు భరోసా ఇస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్థంగా తయారైందన్నారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఎవరినీ ఎంపిక చేస్తే వారికి మాత్రమే ఫించన్లు అందుతున్నాయని, ఫించన్లకు ఆధార్ లింక్‌పెట్టి ఆధార్‌లో తప్పులు ఉన్నాయన్న సాకుతో అర్హులకు ఫించన్లను అందజేయడం లేదని ఆరోపించారు. వికలాంగులు, వితంతువుల ఫించన్ లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని, పించన్ల పంపిణీ ఓ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల వితంతువు మహిళలకు ఫించన్లు ఇవ్వకుండా కుట్రపూరిత వైఖరిని సాగిస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జన్మభూమి కమిటీల మీద పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. లబ్ధిదారులు కోర్టుకు వెళ్లి ఫించన్లు తెచ్చుకునే దుస్థితి నెలకొందన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఫించన్లు అందేవరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
తేనెకుట్టిన దొంగలా చంద్రబాబుగిరిజన ప్రాంతాలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర మండిపడ్డారు. గిరిజన సమస్యలను పరిష్కరిస్తున్న నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని ఎందుకు బదిలీ చేశారని రాజన్నదొర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ...ప్రజలు నిత్యం మంచినీరు, రహదారులు, ఆరోగ్యం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారి రెగ్యూలర్‌గా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
గిరిజన ప్రాంతాలు బాగుపడాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరితే.... వెంటనే సంబంధిత అధికారులను నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో పథకాలు పెట్టి చంద్రబాబు ఆయన పేరును చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా హరిజన, గిరజన ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏలోని అధికారులపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు తేలుకుట్టిన దొంగలా వ్యవహారిస్తుందని నిలదీశారు. ఐటీడీఏలోని అధికారులపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.