రాష్ట్రంలో తాలిబాన్ల పాలన

  • రైతులను వైర్లకు వేలాడదీయడం హేయనీయం
  • మహిళలు, జర్నలిస్టులపై నడిరోడ్డున పడేసి కొడతారా
  • ఎక్కడకు పోతున్నారు బాబు...ఇంత రాక్షసత్వమా
  • చట్టం మీ బాబు చుట్టమా
  • మీ అరాచకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు
  • సామాన్య ప్రజలపై దాడులు ఆపకపోతే మీ కోరలు పీకుతారు
  • టీడీపీ సర్కార్ పై వాసిరెడ్డి పద్మ ధ్వజం
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన, బరితెంగిచిన తాలిబాన్ల పాలన సాగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. రైతులు, మహిళలు, సామాన్య ప్రజలపై తెలుగుదేశం నాయకులు దాడులకు తెగబడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలు, చట్టాలు, మీడియా వేటిపైనా చంద్రబాబుకు గౌరవం లేదని, శాంతిభద్రతలను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతపురం జిల్లాలో ఓ రైతు, అతని కొడుకును టీడీపీ నేతలు వైర్లతో వేలాడదీయడం అత్యంత హేయనీయమన్నారు. ఇదే జిల్లాలోఓ మహిళను నడిరోడ్డున పడేసి కాలితో తన్నుతూ టీడీపీ సర్పంచ్ గూండాగిరి చేసినా, ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు జర్నలిస్టును నడిరోడ్డున కర్రలతో చితకబాదినా అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన సాగుతుందో, ఎంతటి రాక్షస మనస్తత్వంతో పాలన సాగుతుందో అర్థమవుతోందన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రులు గానీ, ముఖ్యమంత్రి గానీ నోరు విప్పకపోవడం, అరెస్ట్ లు చేయకపోవడం దారుణమన్నారు. 

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వోని జుట్టుపట్టుకొని ఈడ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇలా జరిగేదా..? బాబు సెటిల్ మెంట్ చేయడం వల్లే తెలుగుదేశం నాయకులకు కొమ్ములొచ్చాయని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యుడి కష్టానికి దిక్కులేకుండా పోయింది. రైతులను తీగలకు వేలాడదీస్తారా, జర్నలిస్టులను, మహిళలను నడిరోడ్డున పడేసి కొడతారా..? అంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల్లూరులో రైల్వే లైన్ వేయకుండా కమీషన్ల కోసం అడ్డుపడ్డారు. స్పీకర్ కొడుకు కమీషన్ల కోసం పనులు ఆపుతున్నాడని కేంద్రానికి రిఫర్ చేసే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు భరోసా లేకుండా పోయిందని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.  కాంట్రాక్టర్లకు, అవినీతి మంత్రులకు కొమ్ముకాస్తూ వాటాలు పంచుకుంటూ బాబు పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు.  చివరకు మీడియాను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు సర్కార్ పై పద్మ మండిపడ్డారు. ఎక్కడకు పోతున్నారు. రాష్ట్రంలో పాలన మీ జోబు సొత్తా..?  బాబును, లోకేష్ ను ఇలాగే 40 అడుగుల లోతులో వేలాడదీస్తే అప్పుడైనా రైతుల బాధ అర్థమవుతుందేమోనని ఎద్దేవా చేశారు. 

ఏ పొలంలో ఏం పండుతుందో తనకు డ్యాష్ కోర్ బోర్డుద్వారా తెలిసిపోతుందన్న బాబుకు నడిరోడ్డుపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు కనబడడం లేదా పద్మ అని ప్రశ్నించారు. చట్టం మీ బాబు చుట్టమా...? మీడియాపై మీకెందుకు అసహనం..? హోదా అడగకూడదు, మీ అవినీతిని, భూబాగోతాలను వేటిని అడగకూడదు. ఓ కథనం రాస్తే మీడియాను టార్గెట్ చేస్తున్నారు. పరిపాలన సజావుగా సాగాలంటే ప్రతిపక్షం ఎంత ముఖ్యమో, మీడియా అంత ముఖ్యమే. రాష్ట్రంలో టీడీపీ నేతలు వీరవిహారం చేస్తున్నారు. ఏం సంస్కృతి నేర్పుతున్నారు. అధికారముందని నాటకలాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ కోరలు పీకుతారని బాబును హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ నేరంలో బాబు హస్తముందని పద్మ ఆరోపించారు. ఏపీ  ప్రజలకున్న విజ్ఞతను టీడీపీ నాయకులు చెదపురుగుల్లా కొరికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాల్ని ఇప్పటికైనా కట్టడి చేయాలని బాబుకు సూచించారు. లేకపోతే తగిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

Back to Top