స్థానిక ఎన్నికలలో ఐక్యంగా పనిచేయాలి

హైదరాబాద్, 17 మే 2013:

స్థానిక సంస్థల ఎన్నికలలో ఐక్యంగా పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్సు లోటస్ పాండ్ లోని నివాసంలో శుక్రవారం ఉదయం ఏర్పాటైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలను చర్చించారు. దాదాపు 150 మంది ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ గ్రామాలలో మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సలహా ఇచ్చారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తూ, అందరిని కలుపుకుని వెళ్ళాలని చెప్పారు. ప్రజల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని చీల్చాలని కొందరు చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

ప్రభుత్వం మైనార్టీలో ఉందనీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహకారంతో నడుస్తోందనీ శ్రీమతి విజయమ్మ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అండతో కిరణ్ ప్రభుత్వం ఎటువంటి భయంలేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి పని చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలూ కలిసి నడుస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కన్వీనర్లు పాల్గొన్నారు.

Back to Top