అవినీతి కంపు కొడుతున్న ఆంధ్రప్రదేశ్

 • వైయస్ జగన్ ను ఎదుర్కొనే దమ్ము బాబుకు లేదు
 • రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతి మయం చేశాడు
 • జననేతను ఎదుర్కోలేక అపనిందలు మోపుతున్నాడు
 • మీ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయించుకునే దమ్ముందా బాబు
 • పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..?
 • ఏపీని కాపాడేందుకు కేంద్రం దృష్టిసారించాలిః పార్థసారథి
 •  
  హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక... ఆయనపై అపనిందలు వేసి రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారని బాబుపై నిప్పులు చెరిగారు. సీబీఐ ఎంక్వైరీలో భాగంగా ఈడీ తాత్కాలికంగా ఆస్తులను అటాచ్ చేస్తే...టీడీపీ నేతలు సంకలు చర్చుకోవడం విడ్డూరమన్నారు. తనపై వచ్చిన అపనిందలపై విచారణను వైయస్ జగన్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని పార్థసారథి చెప్పారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాలపై టీవీల్లో ఊదరగొడుతూ టీడీపీ నేతలు అభియోగాలు మోపడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. 

  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక చంద్రబాబు, సోనియాగాంధీ ఏవిధంగా కలిసి కుట్రలు పన్నారో, వైయస్ జగన్ రాజకీయాల్లో లేని కాలానికి సంబంధించిన విషయాలపై ఏవిధంగా ఎంక్వైరీలు వేయించి విచారణలు చేయిస్తున్నారో, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను ఎలా కలుస్తున్నారో ప్రజలందరూ గమనించారని పార్థసారథి గుర్తు చేశారు. ఐదేళ్ల నుంచి టీడీపీ నేతలు వైయస్ జగన్ పై అపనిందలు వేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు కూడా వేశారన్నారు. జననేతను ఎదుర్కోవడం కోసం ప్రజల్ని నిట్టనిలువునా మోసం చేశారని బాబుపై ఫైర్ అయ్యారు. మాట్లాడితే నీతి, నిజాయితీ, సచ్చీలుడిని అని చెప్పుకునే చంద్రబాబు తన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. తాము అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని, త్వరలోనే వాస్తవాలేమిటో తెలుస్తాయన్నారు.  కానీ, చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ అంటే  ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. 

  రాష్ట్రంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, రాజధానిలో అవినీతి కంపు కొడుతుందని వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో చెబుతున్నాయని పార్థసారథి చెప్పారు. బాబు అనుసరిస్తున్న విధానాలు తప్పుడు విధానాలని, లోపభూయిష్టమైనవని కేంద్ర కమిటీలు సైతం రిపోర్ట్ లు ఇచ్చాయని తెలిపారు. ఏ మచ్చలేదు, నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం కాదని దమ్ముంటే వాటిని నిరూపించుకోవాలని పార్థసారథి అధికార టీడీపీకి సవాల్ విసిరారు. నిజాయితీగా రాజధాని నిర్మిస్తున్నామని మీరు భావిస్తే, నిజంగా మీకు ధైర్యం ఉంటే రెండేళ్ల అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ అంటే ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో సీబీఐ ఎంక్వైరీ జరిగితే దాన్ని ఎదుర్కోలేక స్టే తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబని పార్థసారథి దుయ్యబట్టారు. 

  గతంలో వైయస్సార్ హయాంలో అభియోగాలు వస్తే వైయస్ జగన్, మంత్రుల మీద ఆ మహానేత సీబీఐ ఎంక్వైరీ వేయించిన విషయాన్ని పార్థసారథి గుర్తు చేశారు. ఆఎంక్వైరీలో వారు సచ్చీలురని బయటకొచ్చిన విషయం మీకు తెలియదా అని టీడీపీ నేతలను నిలదీశారు . అభివృద్ధిని గాలికొదిలేసి ఎంతసేపు  జగన్ జగన్ అంటూ టీడీపీ నేతలు కలవరించడం సిగ్గుచేటన్నారు.  స్విస్ చాలెంజ్ లో సింగపూర్ కంపెనీలతో  ఏవిధంగా లాలూచీ పడ్డారో, వాళ్లకు రాజధాని భూములను కట్టబెట్టేందుకు అగ్రిమెంట్లు ఎలా తయారుచేస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు.  

  దేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్న పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్న చైనాకు వెళ్లి పెట్టుబడులు తెస్తానని చంద్రబాబు చెప్పడం ఏమేరకు సబబని పార్థసారథి నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి  చైనాకు పెట్టుబడులు వస్తున్నాయని అక్కడ ప్రచారం జరుగుతోందంటే...బాబు మాత్రం చైనా నుంచి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ కోట్లాది రూపాయలు గుమ్మరించి పారిశ్రామిక సమ్మిట్ లలో ఊదరగొట్టారు. ప్రధాని మోడీతో పోటీపడి చంద్రబాబు విదేశాలు తిరిగి వస్తున్నారు.  రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు బాబు రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ఏ దేశాల నుంచి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 

  రాజధాని, పట్టిసీమ,  రేషన్ మొదలు నీరు‍ చెట్టు, ఆఖరికి సన్ స్ట్రోక్ తో పడిపోయే వాళ్లకు సహాయం చేసే దాంట్లో  కూడా టీడీపీ అవినీతికి పాల్పడుతోందన్నారు. రాష్ట్రంలో ఏకార్యక్రమం కూడా అవినీతి లేకుండా జరగడం లేదన్నారు.  ప్రభుత్వం చేసే ప్రతీ దాంట్లో అవినీతి కంపు కొడుతోందని పార్థసారథి మండిపడ్డారు.  చంద్రబాబు 2019 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  విభజించబడిన ఏపీని కాపాడేదుకు ముందుకు రావాలని, టీడీపీ అవినీతిపై దృష్టి సారించాలని పార్థసారథి కేంద్రాన్ని కోరారు.   

Back to Top