యువత భవిష్యత్‌కు నేను భరోసా

పెద్దాపురం (తూ.గో.జిల్లా):

‘రాష్ట్రాన్ని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అడ్డగోలుగా విభజించి మన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీశాయి. యువతను రోడ్డున పడేశాయి. కానీ, ‌మన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తా. అందు కోసం ప్రతి రోజూ కష్టపడతానని మాట ఇస్తున్నా. నిరుద్యోగులకు అండగా ఉంటా. ఉద్యోగాల విషయంలో అందరికీ ఒక మంచి అన్నయ్యగా ఉంటా. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయతతో ఈ మాట చెబుతున్నా’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయ జంక్షన్‌లో శనివారం రాత్రి నిర్వహించిన వైయస్ఆర్ జనభేరి సభకు అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ జగన్ ప్రసంగించారు. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా తోట సుబ్బారావు నాయుడు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీ‌ల్‌ను ప్రకటించి, వారిని గెలిపించాలని శ్రీ జగన్ కోరారు.

‘విద్యార్థు‌లు, వారి భవిష్య‌త్ గురించి చంద్రబాబు నాయుడ తన పాలనా కాలంలో అస్సలు పట్టించుకోలేదు. పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు ఏ రకంగా ఇబ్బందిపడుతున్నారని ఆయన ఏనాడూ తెలుసుకోలేదు. ఆ రోజు ఇంజనీరింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు పొలాలు, ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థి‌తి కల్పించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం చొప్పున రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానంటూ దొంగ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’’అని శ్రీ వైయస్ జగ‌న్ విమర్శించారు.

‌హతమార్చి ఆనక ఫొటోకు దండ తానే వేస్తానన్నట్టు :
‘రాష్ర్టం ముక్కలవడం అన్యాయం అంటూనే విభజనకు అనుకూలంగా తన ఎంపీలతో చంద్రబాబు నాయుడు ఓటువేయించారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్నారు. ఇదెలా ఉందంటే.. ‘ఒక మనిషిని చంపేసి ఆ ఫోటోకు నేనే దండ కూడా వేస్తా’నన్నట్టుగా ఉంది‌' అని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు నా వద్దకు వచ్చారు. మీరు కూడా రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పేయండి, ఆ తర్వాత చూద్దామని చెప్పారు. నిజంగా ఆ రుణాల మాఫీ కోసం ఏం చేయాలి.. చేయగలుగుతామా అని బడ్జెట్‌ను అధ్యయనం చేశా. రైతుల రుణాలు లక్షా 27 వేల కోట్లున్నాయి. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల రుణాలు 20 వేల కోట్లు ఉన్నాయి. 2008లో రుణాలు చెల్లించలేక రైతులు చేతులెత్తేసిన పరిస్థితుల్లో కేంద్రం 65 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తే మన రాష్ట్రానికి కేవలం 12 వేల కోట్లు వచ్చింది. అలాంటిది చంద్రబాబు ఏకంగా 1.47 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా.. ఈ స్థాయిలో అబద్ధాలు ఆడడం ఎక్కడైనా ఉందా? నాకు ఇలా మోసం చేయడం చేతకాదు' అన్నారు.

వారసత్వంగా నాకు విశ్వసనీయత వచ్చింది :
'చంద్రబాబు కన్నా నేను 25 ఏళ్లు చిన్నవాడిని. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకే ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. కానీ వైయస్ఆర్ నుంచి నాకు వారసత్వంగా విశ్వసనీయత వచ్చింది అని గర్వంగా చెబుతున్నా. నేను మాట ఇస్తే తప్పను' అన్నారు.

పార్టీలో చేరిన ముత్యాల పాప :
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే బొళెం ముత్యాల పాప శనివారం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో సామర్లకోటలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ముత్యాలపాపతో‌ పాటు ఆమె అనుచరులకు కండువాలు వేసి శ్రీ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.

Back to Top