ఎన్నికలయ్యాక బాబు గాయబ్

విజయవాడ/గుంటూరు

: 65 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఎన్నికలు అయిపోయిన తరువాత తాను ఉండనని, తన పార్టీ కూడా ఉండదని ఆయనకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు. విశ్వసనీయతలేని రాజకీయాలు చేస్తున్నారు. ఏదైనా చేసి, ఏమైనా చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం, పదవుల కోసం ఏ గడ్డి అయినా తింటారు. ఎన్ని అబద్ధాలైనా ఆడగలరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతారు.. అధికారం పోయిన తరువాత మళ్లీ అధికారం కోసం రకరకాల అబద్ధాలు ఆడుతుంటారు' అని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం, గుంటూరుల్లో నిర్వహించిన ‘వైయస్‌ఆర్ జనభేరి’ సభల్లో మాట్లాడారు.‌

'ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో చంద్రబాబు మీ దగ్గరకు వస్తారు. మీటింగులు పెడతారు. అప్పుడు మీరు ఒక మాట అడగండి. చంద్రబాబూ.. ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు వీటిలో ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు ఆడతావు అని ప్రశ్నించండి?’ అని‌ ప్రజలకు శ్రీ జగన్ సూచించారు.
మహానేత వైయస్ఆర్ వెళ్లిపోయాక నిజాయితీ ‌పోయింది :

‘మహానేత‌ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ‌సుమారు ఐదేళ్ళ క్రితం మన మధ్య నుంచి వెళ్లిపోయారు. వైయస్ఆర్ కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం. ఆయన తరువాత కూడా ముఖ్యమంత్రులను చూశాం. కానీ వై‌యస్ఆర్ మాత్రమే ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి’ అని ఈ రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పారు. ఆ దివంగత నేత మన మధ్య లేకపోయినా.. ప్రతి గుండెలో ఆయన బతికే ఉన్నా‌రు. దివంగత మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్నదే లేకుండా పోయింది. ఆయన చనిపోయిన తరువాత విశ్వసనీయత అనే పదం టార్చిలైటు పట్టి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు' అని విచారం వ్యక్తం చేశారు.

ఆల్‌ ఫ్రీ బాబును అక్కడే నిలదీయండి :

'మీ దగ్గరకు వచ్చి అన్నీ ఫ్రీ అంటూ హామీలిచ్చే చంద్రబాబును అక్కడే నిలదీయండి. చంద్రబాబు నాయుడూ అప్పట్లో ఎన్నికలకు వెళ్లే ముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు. ఎన్నికలు అయిపోయాక ప్రజలతో నాకేం పని ఉందని రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా అని ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లే ముందు అక్క చెల్లెమ్మల ఓట్ల కోసమని మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పావు. ఎన్నికలు అయిపోయాక మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం అంతా దివాళా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. అలా రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని నిలదీయండి' అని ప్రజలకు శ్రీ జగన్ పిలుపునిచ్చారు.

‌'తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి‌ అయ్యే రూ.30 వేలు కట్టాలంటే తల్లిదండ్రులు పొలమో, ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ అంటూ ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడి హయాంలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ‌కేన్స‌ర్ వచ్చి డాక్టర్ దగ్గరకు వె‌ళితే.. రూ. 2 లక్షలో... రూ.3 లక్షలో, రూ.5 లక్షలో అవుతుందన్నప్పుడు రెండు రూపాయలు, మూడు రూపాయలు, ఐదు రూపాయల వడ్డీలకు అప్పు తెచ్చినప్పుడు నీవు ఏం చేశావు చంద్రబాబూ అని నిలదీయండి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనలో వరుసగా కరువులొచ్చినప్పుడు రైతులందరూ కరెంటు చార్జీలు తగ్గించండి, కరెంటు ఉచితంగా ఇవ్వండి, రుణాల మీద వడ్డీ మాఫీ చేయండి అని అడిగితే, నిరాహార దీక్షలు చేస్తే బషీర్‌బాగ్‌లో రైతన్నలను పిట్టల్లా కాల్చలేదా చంద్రబాబు నాయుడూ అని నిలదీయండి' అని శ్రీ జగన్‌ అన్నారు.

ఆల్‌ ఫ్రీ బాబు లిస్టులో సెల్‌ఫోన్లు, టీవీలు :
అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఈ రోజు కూడా రకరకాల అబద్ధాలు చెబుతున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఒక రోజు సెల్‌ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తారు. ఒక రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటారు. ఇంకోరోజు రైతు రుణాలు మాఫీ అంటారు. ఒక రోజు అక్కాచెల్లెళ్ల రుణాల మాఫీ అంటారు. మరో రోజు మీరెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు.. మీ ఇంటికే అన్ని ఫ్రీగా ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను చంద్రబాబు నాయుడిలా అబద్ధాలు ఆడలేను. ఆయనలా విశ్వసనీయత, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఎందుకంటే చంద్రబాబు కంటే నేను పాతిక సంవత్సరాలు చిన్నవాణ్ణి. మరో 30 సంవత్సరాలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాల్సిన వాడిని' అన్నారు.

‌'దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చిన వారసత్వం విశ్వసనీయత. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులను చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. చెప్పినవే కాదు.. చెప్పనివీ చేస్తాను. ఈ రోజు ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపున కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీలకు ఓటు వేద్దాం.. వై‌యస్ఆర్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొద్దాం’‌ అన్నారు.

ఐదు సంతకాలు.. ఆరు పనులు :
'ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. వాటితో పాటు మరో ఆరు పనులు కూడా చేయబోతున్నాను. వీటితో రాష్ట్ర దశ, దిశ మారుస్తానని మాటిస్తున్నాను. వాటిలో మొదటి సంతకం ‘అమ్మ ఒడి’ పథకంపై ఫైలుపై చేస్తాను. అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడికి పంపితే ఇంజినీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తాను. ప్రతీ స్కూలులోనూ ఇంగ్లీషు మీడియం పెడతాను. బడికి పంపించే ప్రతీ పిల్లాడికి రూ. 500 చొప్పున ఇద్దరు పిల్లలకు వెయ్యి నెల నెలా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను.

‌'రెండవ సంతకం అవ్వా తాతల కోసం పెడతాను. మహానేత వైయస్ఆర్ పుణ్యాన రూ. 200 పెన్షన్ వ‌స్తోంది. కానీ అది సరిపోవడం లేదంటున్నారు. వారికి రూ. 700 పెన్షన్ ఇస్తాను. మూడ‌వ సంతకం రైతన్నల కోసం పెడతా. పంటలకు మద్దతు, గిట్టుబాటు ధర ఇస్తూ రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను. కరవు, వరద వచ్చినా వారికి అండగా ఉండేందుకు మరో రూ. 2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాను. నాలుగవ సంతకమూ అక్క చెల్లెమ్మల కోసమే. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఒక ఆఫీసు తెరుస్తాను. అడిగిన వారికి 24 గంటల్లో ఏ కార్డైనా అందజేస్తాను. ఐదో సంతకం ఈ ఫైలుపైనే చేస్తాను'.

'2019 నాటికి అందరికీ ఇల్లు ఉండే కార్యక్రమాన్ని ఆరవ పనిగా చేస్తాను. ఏడాదికి 10 లక్షలు, ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టి ప్రతి నిరుపేదకూ నీడనిస్తాను. 50 లక్షల ఇళ్లే కాదు 50 లక్షల పట్టాలు కూడా మహిళల పేరు మీద ఇవ్వబోతున్నాను. అవసరం వచ్చినప్పుడు లక్షకు పైగా విలువ చేసే ఆ ఇంటిపట్టాను బ్యాంకులో పెట్టి రూ. 30 వేలు రుణం పావలా వడ్డీ కింద తీసుకునే వెసులుబాటు కల్పించేలా బ్యాంకర్లతో మాట్లాడతాను'. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైయస్ఆర్ గర్వపడే విధంగా గొప్పగా అమలు చే‌యడం ఏడవ పనిగా చేస్తాను. గుండెపోటు వచ్చి ఆపరేషన్‌ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు విశ్రాంతి సమయంలో నెలకు రూ. 3 వేల చొప్పున ఇచ్చి వారిని ఆదుకుంటాను.'

'ఊళ్లల్లో ఐదారు గంటలు కూడా కరెంటు ఉండటంలేదు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2019 నాటికి కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని నిర్మించడాన్ని ఎనిమిదో పనిగా చేస్తాను. పగటి పూటే రైతులకు ఏడు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తాను. పేదలకు ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు వెలిగించుకునేందుకు ఖర్చయ్యే 150 యూనిట్ల కరెంటు రూ. 100కే అందించడాన్ని తొమ్మిదో పనిగా చేస్తాను. ఏ గ్రామంలోనూ బెల్టుషాపులు లేకుండా చేస్తాను. అక్రమ మద్యం నియంత్రించేందుకు ప్రతీ గ్రామం నుంచి 10 మంది మహిళలను మహిళా పోలీసులుగా నియమిస్తాను.'

'చదువుకున్న వారికి ఉద్యోగం వస్తుందన్న ధీమా ఇస్తాను. చంద్రబాబులా ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పను. గత నాలుగేళ్ళుగా ఇళ్లు విడిచి రాత్రనక పగలనక నేను కష్టపడడం చూశారు. ఎండనక వాననక తిరిగే విధానాన్ని చూశారు. చదువుకునే ప్రతీ పిల్లాడినీ నా సొంత తమ్ముడి కోసం ఉద్యోగం వెతక వలసి వస్తే ఏ విధంగా నేను కష్టపడతానో అదే స్థాయిలో వారి కోసం కష్టపడతాను' అని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు.

Back to Top