హైదరాబాద్, 28 ఆగస్టు 2013:
మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని ప్రస్తుత స్థితిలోనే కొనసాగించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారం నాలుగవ రోజుకు చేరుకుంది. చంచల్‌గూడ జైలులో నిర్బంధంలో ఉన్నా శ్రీ జగన్ జనం కోసం దీక్ష చేపట్టారు. శ్రీ జగన్కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఎనలేని మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎదుర్కొంటూ కూడా ప్రజల కోసం జైలు నుంచే శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు ప్రజలంతా సంఘీభావం తెలుపుతున్నారు.
జైలు వైద్యులు మంగళవారంనాడు శ్రీ జగన్‌కు మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్, పల్సు రేట్‌కు సంబంధించిన పరీక్షలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు పరీక్షలు నిర్వహించారు. శ్రీ జగన్ బిపి, షుగర్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో జైలు అధికారులు తెలిపారు.
వరుసగా నాలుగవ రోజు ఉదయం కూడా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కొంచెం నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోవాలని జైలు అధికారులు విజ్ఞప్తి చేసినా శ్రీ జగన్ సున్నితంగా తిరస్కరించారు. శ్రీ జగన్ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉండటంతో రాత్రి సమయంలో కూడా వైద్యులు అందుబాటులో ఉండేలా జైలు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.