జగన్మోహన్‌రెడ్డి 'సమైక్య దీక్ష' ప్రారంభం

హైదరాబాద్, 5 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉదయం సరిగ్గా 11.30 గంటలకు ఆయన మహానేత̴, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి సమైక్య దీక్షా వేదికపై కూర్చున్నారు.
అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్ళరాదన్న సిబిఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీ జగన్‌ లోటస్‌పాండ్‌లోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే.. క్యాంపు కార్యాలయం బయట దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు. ఒక సందర్భంలో నిర్వాహకులు వేసిన టెంటును కూడా పోలీసులు కూల్చివేశారు. దీనితో శ్రీ జగన్‌ తన కార్యాలయం ఆవరణలోనే దీక్ష ప్రారంభించారు. నివాసం నుంచి బయటికి వస్తూ.. ప్రాంగణంలో ఉన్న పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ శ్రీ జగన్‌ దీక్షా వేదిక మీదకు చేరుకున్నారు.

శ్రీ జగన్‌తో పాటు పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు కూడా దీక్ష వేదికపై ఉన్నారు.

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ శ్రీ జగన్‌ ఇటీవలే జైలు నిర్బంధంలో కూడా ఏడు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కూడా గుంటూరులో సమైక్య దీక్ష చేశారు.

కాగా, శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్షా శిబిరానికి వైయస్ అభిమానులు‌, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ స్థాయిలో మొహరించారు. సమైక్య దీక్షా ప్రాంగణం అభిమానులతో కిటకిటలాడుతోంది.

Back to Top