ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే

()హోదా కోసం ఉద్యమిస్తోంది ఒక్క వైయస్సార్సీపీనే
()గత్యంతరం లేకనే టీడీపీ హోదా డ్రామాలాడుతోంది
()హోదా సాధించకపోతే బాబును ప్రజలు క్షమించరు
()పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చాలి
()వైయస్సార్సీపీ ఎంపీలు రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, రేణుక

న్యూఢిల్లీః  ప్రత్యేకహోదా అన్నది ఏపీ ప్రజల హక్కు, ఆస్తి అని వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనని అన్నారు. హోదాను సాధించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. చంద్రబాబు, మోడీలిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం...పులిస్టాప్ లు, కామాలు తీసేయడం కాదని...విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ హోదాకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. 

హోదా కోసం వైయస్సార్సీపీ  అనేక విధాలుగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.  హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేకపాటి కుండబద్దలు కొట్టారు. హోదా కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, అందుకు నిన్న నెల్లూరులో జరిగిన యువభేరి కార్యక్రమమే ఉదాహరణ అని చెప్పారు. ఏపీకి పదేళ్లు హోదా ఇస్తాం,  అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో మోడీ అనేకసార్లు చెప్పారన్నారు. కుంటిసాకులు చెప్పి ఏపీ ప్రజలను మోసగించడం ప్రధానికి తగదన్నారు. హోదా తీసుకురాకపోతే చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 

గత్యంతరం లేకనే..
హోదా కోసం వైయస్సార్సీపీ పోరాడి ఉండకపోతే...ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేసుండకపోతే ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశమే లేదని ఎంపీ వరప్రసాద్ చెప్పారు. వైయస్సార్సీపీ ఆందోళనలు చేయకపోతే టీడీపీ ఏమాత్రం కూడా హోదాపై మాట్లాడేవారు కాదన్నది తేలిపోయిందన్నారు. రెండేళ్లుగా ప్రజలతో కలిసి తాము హోదా కోసం పోరాడడం వల్లే.... గత్యంతరం లేక ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్లు మా వెంట వస్తున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి కృషి చేస్తూ వస్తోంది ఒక్క వైయస్సార్సీపీయేనని ప్రజలు గుర్తించారని తెలిపారు. ప్రత్యేకహోదాను అమలుపర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. 

కుంటిసాకులు వెతకడం తగదు
హోదా కోసం అటు రాష్ట్రంలో, ఇటు ఢిల్లీలో వైయస్సార్సీపీ నిరసనలు తెలుపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనమే లేదని ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. ఐదు రోజులుగా వెల్ లో ఉండి హోదా కోసం డిమాండ్ చేస్తున్నా, అరిచి గీపెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆనాడు ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. ఇవాళ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని ఇవ్వడానికి అవకాశం ఉన్నా  కుంటిసాకులు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అస్సలు వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో కనీసం క్లారిటీ కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. విభజన సమయంలో అడ్డురాని రూల్స్ ఇప్పుడు వచ్చాయా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తామేమీ కొత్తగా అడగడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్ధానాలనే అమలు చేయమని కోరుతున్నామన్నారు. హోదా ఇస్తేనే ఏపీకి న్యాయం చేసిన వాళ్లవుతారని ప్రభుత్వానికి సూచించారు. 

Back to Top