సోమిరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావు

నెల్లూరు(ముత్తుకూరు) :  టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాలు అన్నీ ఇన్నీ కావ‌ని,  అధికారాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడే వ్య‌క్తి తమ పార్టీ అధినేత వైయ‌స్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ధ్వజమెత్తారు. ముత్తుకూరులో శుక్రవారం కాకాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్రికెట్‌ కిట్లు అమ్మకాలు, కల్తీ ఎరువుల కుంభకోణం, పనికి ఆహార పథకంలో బియ్యం స్వాహా తదితర అక్రమాలు జిల్లా అంతా తెలుసునన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన సోమిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం, కమీషన్లు పుచ్చుకోవడం అందరికీ తెలుసునన్నారు. ఆయన కనుసన్నల్లో నీరుచెట్టు పథకంలో అవినీతిఅక్రమాలు జరిగాయన్నారు.  గట్టిగా అరిచి మాట్లాడితే అబద్దాలు నిజాలు అవుతాయా అని కాకాణి ప్రశ్నించారు. ప్రజా సమస్యలు కోసం పోరాటాలు చేసే వారిపై అధికారంలో ఉన్న వారు కేసులు పెడతారన్నారు. నీవు చేసిన అక్రమాలు, నీపై వచ్చిన ఆరోపణలపై సుమోటో కింద విచారణ చేయించే ధైర్యం ఉందా అని అడిగారు. కనీసం సమాధానం కూడా చెప్పలేకున్నావని ఎద్దేవా చేశారు.

కోర్టు ధిక్కారంపై అప్పీలు:
 సామాజిక పింఛ‌న్ల‌ మంజూరులో జీఓ 135ను విస్మరించి, ఎస్సీ, ఎస్టీలు, వితంతువులులకు న్యాయం చేయకపోవడంపై ఎంపీపీలు న్యాయస్థానానికి వెళ్లే అంశం పరిశీలనలో ఉందని కాకాణి అన్నారు. పెన్షన్ల మంజూరులో జరిగిన అవకతవకలు గతంలో వెలువడిన తీర్పుకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇది కోర్టు ధిక్కారమవుతుందన్నారు. పార్టీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, ఎంపీటీసీ సభ్యులు గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, నడవడి ముత్యంగౌడ్‌ పాల్గొన్నారు.
Back to Top