సమరశంఖం పూరించిన విజయమ్మ

హైదరాబాద్, 9 జూలై 2013:

పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సమరశంఖం పూరించారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మంగళవారం ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. రాజన్న సువర్ణయుగం మళ్ళీ తెచ్చుకోవాలంటే.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉండే వారిని గెలిపించాలని, అభివృద్ధి నిరోధక కాంగ్రెస్, టిడిపిలను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో సువర్ణయుగం నడిచిందని, ‌ఆయనకు ముందు ఆ తరువాత కూడా శూన్యయుగాన్నే చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్నవిగా ప్రజలు గుర్తించాలని కోరారు.

ప్రకటన పాఠం.:
పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరిగేవి కావు. మన రాష్ట్రం ఒక సంధి యుగంలో ప్రయాణిస్తున్నందున ఏ అభ్యర్థిని గెలిపించాలనేది మన అందరి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. సంక్షేమాన్ని ఆకాంక్షించే, వ్యతిరేకించే శక్తుల మధ్య జరిగే పోరాటంగా చూడాలి. గతంలోనూ, ఇప్పుడూ మనందరి భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్న పార్టీలకు - సంక్షేమానికి కట్టుబడిన పార్టీలకు మధ్య పోరాటంగా చూడాలి.

మన రాష్ట్రంలో మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిగారి‌ ఐదేళ్ళ మూడు నెలల పరిపాలన సువర్ణ యుగం. అయితే... ఆయన పాలనకు ముందూ వెనుక ఉన్నది శూన్య యుగం. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం, గతంలోని చంద్రబాబు ప్రభుత్వానికీ ప్రజల నుంచి ఎంతవరకూ డబ్బులు ఎలా పిండుకోవాలా అన్నదే ధ్యాస. కాంగ్రెస్, టిడిపిలు అభివృద్ధి నిరోధక పార్టీలు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించి సర్వనాశనం చేసిన పార్టీలు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు, పన్నులు పెంచడమే తమ హక్కుగా భావించి ప్రజలను అనేక అగచాట్లకు గురిచేసిన పార్టీలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీలూ వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇతర అన్ని రంగాలనూ, గ్రామాలు, సామాజిక వర్గాలను సర్వనాశనం చేశాయి.

కాంగ్రెస్, టిడిపిల పన్నాగాలను వేరు, మొలక దశలోనే నిరోధించేందుకు పంచాయతీ ఎన్నికలు మనందరికీ అందివచ్చిన సువర్ణావకాశంగా భావించాలి. పంచాయతీ ఎన్నికలను అభివృద్ధి నిరోధక శక్తులకు - ప్రజలు నమ్మిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మధ్య జరిగే పోరాటంగా గుర్తించాలి. ఈ ఎన్నికలు విలువలు, విశ్వసనీయతకు - వంచన, కుట్రలకు మధ్య జరిగే ఎన్నికలు. ఈ ప్రారంభ పోరాటంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయమే ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నింటినీ భవిష్యత్తులో తుత్తునియలు చేస్తుంది.

జనహృదయాల్లో కొలువైన మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ మరణించిన ఈ మూడేళ్ళ పది నెలల్లో జరిగిన ఉప ఎన్నికలు, సహకార, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలు కుమ్మక్కైపోవడాన్ని మనమంతా కళ్ళారా చూశాం. చివరికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా ఆ రెండు పార్టీలూ కలిసిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రెండు పార్టీలూ ఒక్కటై గ్రామ స్థాయిలో ఉమ్మడి అభ్యర్థులను బరిలో పెట్టేందుకు కూడా వెనుకాడవు. ఆ పార్టీల కుట్రలను ఛేదించాలి. ఈ ఎన్నికల పోరాటంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అభిమానులు, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే వారు, సంక్షేమ శ్రేయోభిలాషులందరూ ఒక్కటై అభివృద్ధి నిరోధక కాంగ్రెస్‌, టిడిపిల అభ్యర్థులను ఓడించాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికలను వైయస్ఆర్‌ సువర్ణ యుగం స్థాపనకు ముందడుగుగా భావించాలి.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులన్నీ ఒకే మాట - ఒకే బాటగా సమరశంఖం పూరించాలి. తమ బిడ్డల బాగును కాంక్షించే ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ, ఈ సమాజం క్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను గ్రామ స్థాయి నుంచీ బలపరచాలి. ఇదే విషయాన్ని నేను పార్టీ కేడర్‌కు, ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో సవివరంగా చెబుతూ వచ్చాను. మరోసారి చెబుతున్నాను -

                      విజయం మనదే.. కలిసి ముందుకు సాగుదాం..

Back to Top