సమైక్య తీర్మానం ఇప్పటికైనా చేయండి

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పునఃపరిశీలన నిమిత్తం కేంద్రానికి తి‌ప్పి పంపాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని రాష్ట్రపతిని కోరుతూ అసెంబ్లీలో ఇప్పటికైనా తీర్మానాలు చేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా‌ పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కోరారు. ఈ మేరకు స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్‌కు శుక్రవారం ఆమె ఒక లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని గత ఏడాది డిసెంబర్ 12న 77, 78 నిబంధనల కింద తాము ఇచ్చిన నోటీసుపై పది రోజుల్లోపు తదుపరి చర్య చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకూ దాని గురించి పట్టించుకోలేదని ఆమె గుర్తు చేశారు.

2013 డిసెంబర్ 16న అవే నిబంధనల కింద పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర మంత్రివర్గ పునఃపరిశీలన నిమిత్తం వెనక్కి పంపాలని రాష్ట్రపతిని కోరుతూ తీర్మానం చేయాలని ఇచ్చిన నోటీసుపై కూడా పది రోజుల గడువు దాటినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ లేఖలో ఆమె స్పీకర్ దృష్టికి ‌తీసుకువచ్చారు. తాము ఇచ్చిన ఈ రెండు నోటీసుల మేరకు ఇప్పటికైనా తీర్మానాలు చేయాలని శ్రీమతి విజయమ్మ కోరారు.

స్పీకర్‌కు శ్రీమతి విజయమ్మ రాసిన లేఖపై పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకులు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, భూమా శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top