విజయమ్మ 'ఫీజు దీక్ష' పోస్టర్ విడుదల

హైదరాబాద్‌, 17 జూలై 2013:

ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. పెద్ద చదువులు చదవడానికి పేద విద్యార్థులకు ఏ మాత్రం అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. కిరణ్‌ ప్రభుత్వం తీరును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అధిక్షేపిస్తోందన్నారు. పెద్ద చదువులు పేదల హక్కుగా భావించి, ఉన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించే ఫీజు దీక్ష పోస్టర్‌ను‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. భూమనతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, బి. గుర్నాథరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ బిసి సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు, సీఈసీ సభ్యుడు కె. శివకుమార్ ఈ దీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫీజు రీయింబర్సుమెంటు విషయంలో ఈ మూడేళ్ళుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏడు రోజుల పాటు 'ఫీజు పోరు' దీక్ష చేసిన వైనాన్ని భూమన గుర్తుచేశారు. గత ఏడాది పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఫీజు పోరును నడిపించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల ద్రోహచింతనతో వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ సంవత్సరం కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గురు, శుక్రవారాలు రెండు రోజులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఈ దీక్షలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి కోరారు.

ఆగస్టు తొలి వారంలో 3 వేల కి.మీలకు షర్మిల పాదయాత్ర :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగస్టు మొదటివారంలో 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుందని భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో శ్రీమతి షర్మిల పాదయాత్ర సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. రెండున్నర కోట్ల మంది హృదయాలను తాకుతూ లక్ష్యం దిశగా ఆమె పాదయాత్ర దూసుకుపోతోందన్నారు. చంద్రబాబులా రికార్డుల కోసమో, అవార్డుల కోసమో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేయడం లేదని భూమన ఎద్దేవా చేశారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం కల్గించడమే లక్ష్యంగా ఆమె పాదయాత్ర ముందుకు సాగుతోందని తెలిపారు.

Back to Top