బాబు నాటి దుస్థితే మళ్ళీ దాపురించింది

ప్రత్తిపాడు (తూ.గో.జిల్లా) :

'చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం కరువుతో అల్లాడిపోయింది. వానలు కూడా కురవలేదు. ఆయన వేధింపుల కారణంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పని దొరకక వేల కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోయేవి. మళ్లీ అలాంటి దుస్థితే ప్రస్తుత సిఎం కిరణ్ కుమా‌ర్‌ రెడ్డి పాలనలోనూ కనిపిస్తున్నాయి’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

‘ఏ గ్రామంలో చూసిన రహదారులు లేవు. మరుగుదొడ్లు లేవు. కరెంటు అసలే ఉండదు. పింఛన్లు ఇవ్వరు. స్కాలర్‌షిప్ ఉండదు. పావలా‌ వడ్డీ ఇవ్వనే ఇవ్వరు. అన్ని చార్జీలూ పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర ఇలా ఏదీ కొనేలా లేవు. ఒకటి కాదు, రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు మన గ్రామంలో మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక దుష్ట పాలనకు, దానితో కుమ్మక్కై‌ రక్షణ కవచంలా నిలుస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పల్లెల మీదుగా సాగింది.

రౌతులపూడి మార్కెట్ సెంట‌ర్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు, వికలాంగులు, వృద్ధులు తమకు కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, డ్వాక్రా రుణాలు అందడం లేదని, అసలు పక్కా ఇళ్ల మాటే ప్రభుత్వం మరిచిపోయిందని, వంట గ్యాస్ సబ్సిడీ అందడం లేదని వారంతా తమ గోడును శ్రీమతి షర్మిల ముందు వెళ్లబోసుకున్నారు. అనంతరం శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. పై విధంగా వ్యాఖ్యానించారు.‌ అందకి కష్టాలూ పోవాలంటే.. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

శనివారం 14.4 కిలోమీటర్ల పాదయాత్ర :
మరో ప్రజాప్రస్థానం 187వ రోజు శనివారంనాడు శ్రీమతి షర్మిల తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి నుంచి ప్రారంభమైంది. రాజవరం శివారు బసకు రాత్రి 7.30 గంటలకు ఆమె చేరుకున్నారు. శనివారం మొత్తం 14.4 కిలోమీటర్లు నడిచారు. శనివారంనాటి పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసే సమయానికి ఆమె మొత్తం 2,486.4 కిలోమీటర్లు నడిచారు.

శనివారంనాటి పాదయాత్రలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ముదునూరి ప్రసాదరాజు, పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్ర‌ బోస్, జ్యోతుల నెహ్రూ, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, స్థానిక నాయకులు చలమలశెట్టి సునీల్, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టి రాజా, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహ‌న్, ‌పి.కె. రావు, సుంకర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, బసవా చినబాబు, త్రినాథ్‌రెడ్డి, జ్యోతుల నవీన్ పాల్గొన్నారు.

నేడు ‘2,500 కి.మీ’ బహిరంగ సభ:

‌శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మరో మైలురాయిని అధిగమించనుంది. తుని నియోజకవర్గం కాకరాపల్లిలో 2,500 కిలోమీటర్ల పాదయాత్రను ఆమె పూర్తి చేయనున్నారు. ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన ఘటన. 187 రోజుల పాదయాత్రలో 91 నియోజకవర్గాలు, 155 మండలాలు, 35 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్‌లు, 1,551 గ్రామాల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు. 2,500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేస్తున్న సందర్భంగా కాకరాపల్లిలో 24 అడుగుల ఎత్తైన మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పాల్గొంటారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

Back to Top