తెలంగాణ వారి సంక్షేమానికే వైయస్‌ పెద్దపీట

ఖమ్మం:

‘తెలంగాణ, సీమాంధ్రలను మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ వేరుచేసి చూడలేదు. రెండు ప్రాంతాలను రెండు కళ్లుగా చూశారు. అందరూ నా బిడ్డలే అంటూ అందరి అభివృద్ధినీ సమానంగా ఆకాంక్షించారు. సీఎంగా ఉన్న ఐదేళ్లలో రైతులకు రుణ మాఫీ, విద్యుత్ కనెక్షన్లు, ఉచిత విద్యుత్, విద్యు‌త్ బకాయిల మాఫీ విషయంలో వై‌యస్ఆర్ తెలంగాణకే పెద్ద పీట వేశారు’ అని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తెలిపారు. వైయస్ఆర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాదయాత్రను మొదలు పెట్టింది కూడా తెలంగాణలోనే అని, 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్సుమెంట్.. ఇలా ఎన్నోపథకాలను తెలంగాణలోనే ప్రారంభించి ఈ ప్రాంతం పట్ల తనకున్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో శ్రీమతి షర్మిల ప్రారంభించారు.

పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, బచ్చోడు, సుబ్లేడు, తిరుమలాయపాలెం, పెద్దతండాలతో పాటు ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. వైయస్‌ఆర్ అనే మహావృక్షం కింద తెలుగు ప్రజలందరూ సేద తీరారని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన చెరపలేని స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన ‌మరణించినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎక్కువమంది చనిపోయారని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు, వైయస్‌ఆర్‌కు మధ్య ఉన్న చెరగని అనుబంధం, తెలంగాణ బిడ్డల గుండెల్లో ఆయనకు ఉన్న సుస్థిర స్థానం అది అని చెప్పారు. అందుకే ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు? అని రెండు నెలల క్రితం హెడ్‌లైన్సు టుడే చానల్ అడిగితే తెలంగాణ ప్రజలు 60 శాతం మంది వై‌యస్‌ఆర్‌కే ఓటేశారని తెలిపారు.

మహానేత వైయస్ఆర్ మీ గుండెల్లో‌నే ఉన్నారు :
‘జీవితాన్ని పంచుకున్న వారు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు, తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, కాపాడే దేవుడికి మాత్రమే మనం గుండెల్లో చోటిస్తాం... అలాంటిది తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో వైయస్‌ఆర్‌కు చోటిచ్చారు. ఆ అభిమానాన్ని ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా ఉంచుకున్నారంటే అది సామాన్య విషయం కాదు. మీరు గుండెల్లో పెట్టుకోవటం వల్లే వైయస్‌పై మీకు ఉన్న ప్రేమ ఇంకా చెరిగిపోలేదు. ఇందుకు మీరు కాదు వైయస్‌ఆర్‌ కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోడానికే మేము మీ ముందుకు వచ్చాం..’ అని శ్రీమతి షర్మిల అన్నారు.

ఖమ్మం ఎంపీ స్థానం నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానికి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఫ్యాను గుర్తుపై ఓటేసి, పాలేరు అసెంబ్లీ స్థానానికి వై‌యస్ఆర్‌సీపీ మద్దతుతో పోటీచేస్తున్న సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ను సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

Back to Top