చారిత్రక లక్ష్యం దిశగా షర్మిల!

హైదరాబాద్, 16 జూలై 2013:

రాజకీయాలు తెలియవు. రాజకీయ కుయుక్తులు అసలే తెలియవు. రాజకీయ వ్యూహ రచనకు ఆమడ దూరం. ఆమె మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డ శ్రీమతి షర్మిల. పెద్దాయన ఆకస్మిక మరణం... అన్న జైలుకు వెళ్ళడం... శ్రీమతి షర్మిలను జనక్షేత్రంలోకి తీసుకువచ్చాయి. అవ్వలను ఆప్యాయంగా కౌగలిస్తారు.. తాతలను ప్రేమగా పలుకరిస్తారు. చిన్నారులను ఆప్యాయంగా చంకన వేసుకుని నడుస్తారు. వికలాంగులకు మేమున్నామంటూ ధైర్యం నూరిపోస్తారు. ఎండా... వానా.. చలీ దేనినీ లెక్క చేయకుండా జన హృదయాలను స్పృశిస్తూ ముందడుగు వేస్తూ దూసుకుపోతున్నారు జగనన్న వదిలిన బాణం శ్రీమతి షర్మిల. ఈ బాణం ఇప్పుడు రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తోంది.

పాదయాత్ర ప్రారంభించక ముందు శ్రీమతి షర్మిల కేవలం రాజన్న బిడ్డ మాత్రమే. ప్రపంచ చరిత్రలో మరే మహిళా సాహసించని విధంగా 'మరో ప్రజాప్రస్థానం' పేరుతో 3,000 పైచిలుకు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో నడక మొదలు పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 'ప్రజాప్రస్థానం'ను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లోనే ఈ ఈ చారిత్రక పాదయాత్రకు ఉపక్రమించారు. ఒక మహిళ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఒక రికార్డు. అయితే శ్రీమతి షర్మిల రికార్డుల కోసం పాదయాత్ర చేయడంలేదు. కేవలం ప్రజల బాగోగులను తన తండ్రి చూపిన మార్గలో సమీపం నుంచి చూడడం, వారి కష్టాలు కడగండ్లను నేరుగా వారి నుంచే విని, వారి భరోసా ఇచ్చేందుకు ఆమె ఈ పాదయాత్ర మహా యజ్ఞాన్ని చేస్తున్నారు. రాజన్న లేని రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో తెలుసుకుంటున్నారామె.

పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటి బిడ్డగా ఇప్పుడామె మారిపోయారు. పాదయాత్రతో ప్రత్యర్థుల అంచనాలను ఆమె తలకిందులు చేశారు. ప్రజా సమస్యలు సావధానంగా వినడం, విజ్ఞప్తులు స్వీకరించడమే కాకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలోనూ సిద్ధహస్తురాలయ్యారు. ప్రజా కంటక అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, నిస్సిగ్గుగా దానితోనే అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరును ఎండగడుతున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. కష్టాల్లో ఉన్నవారిని ఆత్మీయంగా పలుకరించి, భరోసా ఇచ్చి, వారికి ఒక ధైర్యాన్ని ఆమె ఇస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు ఎంతో విలువైనవని, వారి భవిష్యత్తు బాగుండాలని, జగనన్న వచ్చే వరకూ ఓపిక పట్టండి అని శ్రీమతి షర్మిల ధైర్యాన్నిస్తున్నారు.

2012 అక్టోబర్‌ 18న వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల 2013 జూ‌లై 16 నాటి షెడ్యూల్‌ పూర్తయ్యే సమయానికి మొత్తం 2,819.2 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేస్తున్నారు. కాగా, చంద్రబాబు నాయుడు పాదయాత్ర బ్రేక్‌ అయిన 2,817 కిలోమీటర్ల దూరాన్ని శ్రీమతి షర్మిల నేడు అధిగమిస్తున్నారు. ఈ అరుదైన సంఘటనకు విజయనగరం జిల్లా వేదికగా మారింది. చంద్రబాబు 208 రోజుల్లో ఈ దూరం నడిస్తే.. శ్రీమతి షర్మిల 211 రోజుల్లో పూర్తిచేస్తున్నారు. చంద్రబాబు 16 జిల్లాల్లో నడిచిన దూరాన్ని శ్రీమతి షర్మిల 13వ జిల్లాలోనే అధిగమిస్తున్నారు. నేటికి శ్రీమతి షర్మిల మొత్తం 184 మండలాల్లో 1,784 గ్రామాల్లో నడిచారు. పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల ఇంతవరకూ 194 రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. 155 బహిరంగ సభల్లో ప్రసంగించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లితో కలిసి శ్రీమతి షర్మిల మొత్తం 40 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో పాదయాత్ర చేశారు.

ప్రజల నుంచి వేలాది ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించారు. వేలాది సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాలు చూపించారు. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజు రీయింబర్సుమెంటు, వేలాది స్థానిక సమస్యలను శ్రీమతి షర్మిల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ఇంకా తీసుకువస్తున్నారు.

శ్రీమతి షర్మిల రాయలసీమలో 472 కిలోమీటర్లు, తెలంగాణలో 765.6 కిలోమీటర్లు నడిచారు. రాయలసీమలో 3 జిల్లాలు, తెలంగాణలో 4 జిల్లాలలో ఆమె పాదయాత్ర చేశారు. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించడం ద్వారా శ్రీమతి షర్మిల కోస్తా జిల్లాల్లో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల ప్రారంభంలో చేసిన ప్రసంగాల కన్నా ఇప్పుడు చేస్తున్న ప్రసంగాల్లో ఎంతో పరిణతి కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాలలో అనుభవజ్ఞులైన నాయకులను కూడా ఔరా! అనిపించేలా ఆమె ప్రసంగాలు కొనసాగుతున్నాయి. చెప్పాలనుకున్నది సామాన్యులకు కూడా సూటిగా, స్పష్టంగా, సరళంగా అర్థం అయ్యేలా శ్రీమతి షర్మిల చెబుతున్నారు. సమకాలీన రాజకీయాలపై స్పందించడంలో ఆమె తనకు తానే సాటి అనే రీతిలో సాగిపోతున్నారు. చిట్టచివరిగా శ్రీకాకుళం జిల్లాలో నడిచి ఒరిస్సా సరిహద్దు ఇచ్ఛాపురం వద్ద 3,000 కిలోమీటర్ల పాదయాత్రను శ్రీమతి షర్మిల పూర్తిచేస్తారు.

Back to Top