జన హృదయాల్లో షర్మిల మరో ప్రజాప్రస్థానం

కోట (నెల్లూరు జిల్లా) :

మహానేత డాక్టర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి ‌తనయ, జననేత, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అభివర్ణించారు. ప్రపంచంలో మరే మహిళా సాహసించలేని అరుదైన చరిత్రను శ్రీమతి షర్మిల సృష్టించారన్నారు. పాదయాత్రలో ఆమె ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా కోటలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసన్న మాట్లాడారు.

ఎండ, వానలను లెక్కచేయకుండా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాదయాత్రను కొనసాగించిన శ్రీమతి షర్మిలకు గిన్నిస్‌బుక్‌లో స్థానం కల్పించాలని ప్రసన్న అన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు దుర్మార్గుడన్నారు. చంద్రబాబు మోసపూరిత విధానాలు భరించలేక టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారన్నారు. దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా‌ అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలు కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విప్ జారీచేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. ఆ రోజు చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే కాంగ్రె‌స్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేదని తెలిపారు.

‌టిడిపి శకం ఎన్టీఆర్‌తోనే ముగిసిందని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నాని ప్రసన్న అన్నారు. రాష్ట్రాన్ని కాపాడగలిగిన వ్యక్తి‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. అన్ని ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌దే విజయమన్నారు. గూడూరు డివిజన్‌లో బుధవారం జరుగుతున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఓటు‌ హక్కును వినియోగించుకుని పంచాయతీలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను రెపరెపలాడించాలని ప్రసన్న కుమార్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు.

Back to Top