పులివెందుల కంటే కదిరి బాగా అభివృద్ధి చేసుకుందాం

అనంతపురం: పులివెందుల కంటే కదిరిని బాగా అభివృద్ధి చేసుకుందామని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్దారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అన్నా వస్తున్నాడని రెండు నెలలుగా ఎదురుచూస్తున్నామని, ఈ రోజు మన కల నెరవేరిందన్నారు. కదిరి రైతాంగం చతికిలపడిందని, ఊర్లు ఖాళీ చేసి బెంగూళూరుకు వలస వెళ్లేవారని, మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వచ్చాక మన బతుకులు మారాయన్నారు. సకాలంలో వర్షాలు కురిసాయని, వ్యవసాయానికి ఉపయోగపడేలా వైయస్‌ఆర్‌ ఎన్నో పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా దాదాపు 56 ఎకరాలు సాగులో ఉందంటే అది మహానేత చలువే అన్నారు. బిందె రూ.5 ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితిలో చిత్రావతి ప్రాజెక్టు పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే కదిరి నుంచే మోసం చేయడం ప్రారంభించారన్నారు. మూడేళ్లు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే తొనకల్లు మండలంలో చంద్రబాబు రెయిన్‌గన్లతో మోసం చేశారన్నారు. ఈ ఏడాది అంతో ఇంతో పంట పడింతే గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులు అమ్ముకున్న తరువాత కొనుగోలు కేంద్రాలు అంటూ దోపిడీకి తెర లేపారన్నారు. సోలార్‌ ప్రాజెక్టు బాధితులకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గిరిజనుల పొట్ట కొట్టారని ధ్వజమెత్తారు. రోడ్ల విస్తరణ పేరుతో ఇల్లు కూల్చుతున్నారని, నేరాలన్ని కూడా కదిరిలోనే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు సీఎం అయ్యాక మళ్లీ వలసలు మొదలయ్యాయని తెలిపారు. మంచి రోజులు రావాలంటే మన ప్రభుత్వం రావాలన్నారు. మనకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పారు. పులివెందుల కంటే కదిరిని బాగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మన కొర్కేలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, రింగ్‌ రోడ్డు వస్తుందని, రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇవన్ని జరగాలంటే అన్నా రావాలి..అందరూ ఆశీర్వదించాలని కోరారు. 
 

 

తాజా వీడియోలు

Back to Top