పబ్లిసిటీ మాని పనులమీద దృష్టిపెట్టు..?

- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవినే
- అందుకే అన్ని రాష్ట్రాలు హోదానే అడుగుతున్నాయ్‌
- ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పాలి
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి
- టీడీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్ః ప్రత్యేక హోదాపై రోజుకో మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మాని రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ పీఏసీ చైర్మన్, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవనే అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే గొప్పదైనప్పుడు అన్ని రాష్ట్రాలు ప్యాకేజీ అడగకుండా హోదా కావాలని ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో బాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపిన చంద్రబాబు మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి కంటే కొత్తగా కేంద్రం ఏమిచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 

షిండేజీ అని లేఖలు రాసి మరీ విభజించారుగా..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోవాలని ఎవరూ కోరుకోకపోయినా   విడిపోయాం. రాష్ట్రం నుంచి టీడీపీ, కేంద్రంలో బీజేపీలు ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలక పోయి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదన్నారు. విభజన జరగకుండా ఉండి ఉంటే మనం ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చేది కాదన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు షిండేజీతో మాట్లాడుతూ విభజనకు అంగీకరిస్తూ ఉత్తరాలు రాసిన  సంగతి మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. అయితే అదంతా గతం. జరిగినదేదో జరిగిపోయింది. ఇకనైనా మాటలాపి ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దృష్టి సారించాలని బాబుకు సూచించారు.  హోదా కావాలని ఒకసారి, హోదా సంజీవినా అని మరోసారి... ప్యాకేజీ బాగుందని ఇంకోసారి తడవకోసారి అర్థం పర్థం లేని మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని బాబుకు హితబోధ చేశారు.

హోదాతో చాలా లాభాలున్నాయి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వలన చాలా ప్రయోజనాలున్నాయని బుగ్గన వివరించారు. హోదా ఉన్న కాలంలో పరిశ్రమలు స్థాపిస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. వంద శాతం ఇన్‌కమ్‌ ట్యాక్స్, సెంట్రల్‌ ఎక్సయిజ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. వీటితోపాటు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులో 3శాతం వడ్డీ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రులు, టీడీపీ నాయకులు, వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడుతూ పరిశ్రమలు తమ పెట్టుబడిలో 15 శాతం ఖర్చుగా చూపించడంతోపాటు 35శాతం తరుగుదల అవకాశం కూడా కల్పించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఇదేమీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిన వరం కాదన్నారు. మనతోపాటు పశ్చిమ బంగా, తెలంగాణ, బీహార్‌ ఇలాంటి రాష్ట్రాలకు కూడా కేటాయించిందని తెలియజేశారు. అలాంటప్పుడు మన కే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పడానికి వారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా ఏపీలో ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎంలు స్థాపిస్తామని చెప్పడం మంచిదే కానీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని కొత్తగా మనకూ కేటాయిస్తున్నారు తప్ప ఇందులో గొప్పతనం ఏమీ లేదన్నారు. ఇవన్నీ విభజన చట్టంలో పొందుపర్చారని అవే వారు నెరవేరుస్తామని చెబుతున్నారని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 

ఇలా అయితే మేకిన్‌ ఇండియా సాధ్యమా
మేకిన్‌ ఇండియా అంటూ ప్రచారం చేసుకుంటున్న మోడీ సార థ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించకుండా మేకిన్‌ ఇండియా ఎలా సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలంటే ఇక్కడ అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడే ఉద్యోగాలు పెరిగి యువకులకు ఉపాధి లభిస్తుందని, తద్వారా రాష్ట్రం పురోగమిస్తుందని వెల్లడించారు. ప్యాకేజీల పేరుతో రావాల్సినవే విదిలిస్తే మేకిన్‌ ఇండియా కలగానే మిగిలిపోవాల్సి ఉంటుందని బుగ్గన పేర్కొన్నారు. 

హోదా వలన ఉత్తరాఖండ్‌ దూసుకెళుతోంది
హోదా వలన రాష్ట్రాలకు ఏమంత ప్రయోజనం కలిగిందే చెప్పాలని మాట్లాడిన చంద్రబాబుకు బుగ్గన ఉత్తరాఖండ్‌ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇటీవలే ప్రత్యేక హోదా సాధించిన కోటి మంది జనాభ గల చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు స్థూల జాతీయోత్పత్తిలో 23 శాతం నిధులు కేటాయిస్తే ఐదు కోట్ల జనాభా కలిగిన ఏపీ కనీసం పదిశాతం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. దీన్ని కూడా ప్రత్యేక ప్యాకే జీ అంటారా అని ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో ఉండే నాయకులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టడం సరికాదన్నారు. ఇదీ చాలదన్నట్టు హోదా కంటే ప్యాకేజీయే బాగుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మరి రెండున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదే అని ఎద్దేవా చేశారు. 

ఎకనామిక్స్‌లో పీహె చ్‌డీ అన్నావ్‌ ఇదేనా.. నీ జ్ఞానం 
చంద్రబాబు తనకు తాను ఆర్థికవేత్తనని, ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశానని చెప్పుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. మరి అంత జ్ఞానమున్న వ్యక్తి ప్యాకేజీకి ఎలా అంగీకారం తెలిపారో తనకైతే అర్థంకావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బాగుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అంతటి విద్యావేత్తకు హోదా వలన కలిగే ప్రయోజనాలు తెలియవా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన దోమలపై దండయాత్రపై ఛలోక్తులు విసిరారు. ఆయన చేసే యుద్ధం ఇంగ్లిషు చిత్రాలను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. ఆయన దోమలను తుపాకులతో కాల్చినట్టు ప్రజలు కలలో కూడా భయపడుతున్నారని తెలిపారు. 

కరువంటే.. పుష్కరాలు, వాగ్ధానాలు అంటే... సింధు
సమస్యలను పక్కదారి పట్టించడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ముఖ్యమంత్రిని బుగ్గన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రతిపక్షాలు కరువు గురించి మాట్లాడితే చంద్రబాబు పుష్కరాలు బాగా చేద్దాం అంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సింధును తయారు చేశానని చెప్పుకుంటారు... ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ముఖ్యమంత్రి దోమలపై సమరం అనడం సమస్యలకు భయపడి తప్పించుకోవడం కాక మరేమిటని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మీపై ఉందని దానిని సమర్థవంతంగా నిర్వహించాలే తప్ప సమస్యలకు సాకులు వెదకడమో.. లేక ప్రతిపక్షాల మీద పడి ఏడవడం చేయడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకు సరికాదని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి పబ్లిసిటీ మాని పనుల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. 
Back to Top