చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి

మండపేట (రాజమండ్రి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నైతిక విలువులు కలిగిన పార్టీ అని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతనే శిల్పామోహన్‌రెడ్డిని పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ ఆర్ సిపిలో చేర్చుకున్నారని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి అన్నారు. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని, తమ దిగజారుడు రాజకీయాలను పక్కదారి పట్టించేందుకు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు)తో కలిసి పట్టాభిరామయ్యచౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలుపొందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య అడ్డగోలుగా కొనుగోలుచేసి పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు నైతికత గూర్చి ప్రజలకు తెలుసునన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కి నలుగురుకి మంత్రి పదవులు, ఒకరికి జెడ్పీ చైర్మన్‌ కట్టబెట్టారన్నారు. శిల్పామోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైయస్సార్‌ సీపీలో చేరడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు తన పార్టీ నేతలతో జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయిస్తున్నారని పట్టాభిరామయ్యచౌదరి మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న బోగస్‌ ప్రచారాన్ని మానుకోవాలని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే  కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో పదువులకు రాజీనామా చేయించాలని రాజుబాబు డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, పార్టీ నాయకులు మహంతి అసిరినాయుడు, పుట్టా ప్రసాద్, సాధనాల శివభగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top