వైఎస్ కు మరణం లేదు... ముగింపు యాత్రలో షర్మిల

రంగారెడ్డి : నేటికీ కోట్ల మంది తెలుగు ప్రజల కళ్లల్లో తడి ఆరలేదు.. ఈ రోజు వరకూ తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారు.. ఆయనకు మరణం లేదు.. తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో రాజన్నగా బతికే ఉంటారు.. ఆయన ఆశయాలను మనమే బతికించాలి.. మీరూ, మేం చేయీ చేయీ కలపాలి.. రాజన్న రాజ్యం తెచ్చుకోవాలి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తున్న షర్మిల గురువారం నాలుగో రోజు మర్పల్లి, మోమిన్పేట, ఆలంపల్లి ప్రాంతాల్లో   కుటుంబాలను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.

అడుగడుగునా నీరాజనం

అనురాగం...ఆత్మీయతల నడుమ రంగారెడ్డి  జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర నాలుగోరోజు కొనసాగింది. గురువారం  మర్పల్లి, మోమిన్పేట, ఆలంపల్లి  ప్రాంతాల్లో  పర్యటించిన షర్మిలకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.  మీకు నీనున్నానంటూ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు.

వైఎస్ షర్మిల  పర్యటన సాగిందిలా..
తాండూరు: పరామర్శ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గురువారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నియోజకవర్గం నుంచి పర్యటించారు.
  • ఉదయం తాండూరు నుంచి బయలుదేరి నేరుగా మర్పల్లి మండలానికి చేరుకొని  అక్కడ కమ్మరి నారాయణ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
  • అక్కడ నుంచి మోమిన్పేటకు చేరుకుని అరిగె యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
  • చివరగా మోమిన్పేట మండలం ఎన్కతలలోని ఆలంపల్లి వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు.  అనంతరం అక్కడి నుంచి లోటస్పాండ్కు చేరుకున్నారు.  
Back to Top