షర్మిలతో నేనూ నడుస్తా: వృద్ధురాలి అభిమానం

విజయవాడ, 13 అక్టోబర్‌ 2012:

మహానేత కుమార్తె షర్మిల ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ప్రకటనతో వైయస్‌ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతీ గుండె పులకరిస్తోంది. మహానేత తనయ పాదయాత్రను ఓ శతాధిక వృద్ధురాలు కూడా మనస్ఫూర్తిగా స్వాగతించింది. షర్మిల పాదయాత్రలో తాను సైతం... అడుగులో అడుగు వేసి నడుస్తానంటూ ఆమె ప్రకటించింది. ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్న వయోధిక సాహసురాలు విజయవాడలోని వించిపేటకు చెందిన కంది అప్పలనర్సమ్మ. ఆమె వయస్సు నూట ఒక్క సంవత్సరాలు. తనకు ఎంత వరకూ ఓపిక ఉంటే అంతవరకూ షర్మిలతో కలిసి నడుస్తానని బోసినవ్వుల మధ్య అప్పలనర్సమ్మ తెలిపింది. సొంత ఖర్చుతో కట్టించిన ఆలయంలో అనునిత్యం కనకదుర్గమ్మను పూజిస్తూ కాలం గడుపుతున్నది అప్పలనర్సమ్మ. ప్రజా నాయకుడంటే వైయస్‌ఆరేనని అంటోంది ఆమె. షర్మిల పాదయాత్రలో తానూ పాల్గొంటానని అప్పలనర్సమ్మ అనడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

వైయస్‌ఆర్‌ అంటే అపరిమితమైన అభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న అప్పల నర్సమ్మ కుటుంబం కూడా షర్మిల పాదయాత్ర ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేసింది. షర్మిల పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో మరో చరిత్రాత్మక సంఘటనగా నిలిచిపోతుందని ఆ కుటుంబం అభివర్ణించింది. అప్పలనర్సమ్మ కుమారుడు గంగాధరరావుకు కూడా గతంలో మహానేత వైయస్‌ఆర్‌తో పరిచయం ఉంది. తన తల్లిని తీసుకుని వెళ్ళి ఇడుపులపాయలో ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్రలో పాల్గొంటానని గంగాధరరావు పేర్కొన్నారు. మహానేత వైయస్‌ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని గంగాధరరావు అన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబానికి తమ వంతు సహకారంగా నూట ఒక్క సంవత్సరాల వయస్సున్న తన తల్లి అప్పలనర్సమ్మను కూడా ఇడుపులపాయకు తీసుకువెళ్ళి షర్మిల పాదయాత్రలో పాల్గొంటామని చెప్పారు.

చంద్రబాబు పాలననే పునరావృతం చేస్తూ, చోద్యం చూస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి రాష్ట్ర ప్రజల సాక్షిగా షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 18న ప్రారంభం అవుతోంది. 2003లో తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ఆయన తనయ ప్రజాప్రస్థానం నిర్వహిస్తున్నారు. సందర్భాలు వేరైనా, వారిద్దరి లక్ష్యం మాత్రం ఒకటే. అది ప్రజాసంక్షేమం. అందుకే షర్మిల యాత్రలో పాల్గొనడానికి తాము సైతం అంటూ ప్రతీ గొంతూ నినదిస్తోంది. వైయస్‌ కుటుంబం పట్ల ఉన్న ప్రజాభిమానానికి ఇంతకంటే సాక్ష్యం మరేమి ఉంటుంది!

Back to Top