<strong>హైదరాబాద్, 18 డిసెంబర్ 2012: </strong>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు రఘువీర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శ్రీమతి షర్మిలను ఆపరేషన్ థియేటర్ నుంచి ఈ రాత్రికి హాస్పిటల్ గదికి మారుస్తామన్నారు. బహుశా రేపు ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.<br/>హైదరాబాద్‌లోని జూబ్లీహిల్సులో ఉన్న అపోలో ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం ఈ శస్త్ర చికిత్స జరిగింది. శ్రీమతి షర్మిలకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని అపోలో ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. శస్త్ర చికిత్స పూర్తయిన అనంతరం వైద్యులు ఈ విషయం ప్రకటించారు. విశ్రాంతి సమయంలో ఆమెకు ప్రతి రోజూ ఫిజియో థెరపీ చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి సెల్ థెరపీ కూడా చేస్తామని వారు వెల్లడించారు.<br/>ఆరు వారాల విశ్రాంతి అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర చేయవచ్చా? అన్న మీడియా ప్రశ్నకు వైద్యులు బదులిస్తూ, అప్పటికి ఆమె గాయం తగ్గిన పరిస్థితిని బట్టి నిర్ణయం చెబుతామని అన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీమతి షర్మిల బస్సు దిగేటప్పుడు కాలు తూలి పడి, మోకాలికి తీవ్ర గాయం అయిందని వైద్యులు తెలిపారు. శ్రీమతి షర్మిలకు రెండు రకాల గాయాలు తగిలాయని తెలిపారు.