తిరుపతి: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ తరహాలో సాగుతోందని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతున్నారని, ఇది పూర్తిగా నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి” అని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే వైయస్ఆర్‌సీపీ శ్రేణులను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆరోపించారు. “పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణకు కాకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే ప్రైవేటు సైన్యంగా మార్చేశారు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదన్న నిజాలు బయటపడటంతో చంద్రబాబు అహం దెబ్బతిన్నదని, దాన్ని కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారని జక్కంపూడి రాజా ఆరోపించారు. “ఆ కుట్రలలో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుగారిని ఏకంగా హత్య చేయాలని చూశారు. ఇది రాజకీయ దాడి కాదు… ప్రజాస్వామ్యంపై చేసిన దాడి” అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజలు మర్చిపోరని, “ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు” అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.