అంతం చేసే కుట్రతోనే అంబటి రాంబాబుపై దాడి 

దాడి జరిగిన తీరు, పోలీసుల ప్రవర్తన అలాగే ఉంది

సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

గుంటూరులో పార్టీ నాయకులతో కలిసి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడారు.

అంబటిని చంపడానికి వస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు

వ్యూహాత్మకంగానే ఉదయం నుంచి టీడీపీ గూండాల హల్‌చల్‌

రోజంతా కర్రలు, రాళ్లతో గుంటూరులో స్వైర విహారం 

 సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

వివాదానికి కారణమైన ఫ్లెక్సీకి పోలీసుల బందోబస్తు 

ప్రాణాలు తీయడానికి వస్తుంటే మాత్రం కళ్లప్పగించి చూశారు

ఫిర్యాదు చేయడానికి ఫోన్‌ చేసినా డీజీపీ ఫోన్‌ తీయలేదు

మాజీ హోం మంత్రిని ఎస్పీ ఇంటి గేటు బయట నిలబెట్టారు

దాడిలో పాల్గొన్నవారినీ, సహకరించిన పోలీసులనూ వదిలిపెట్టం

చట్టపరంగా అందర్నీ ఖచ్చితంగా శిక్షించి తీరుతాం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన  సజ్జల రామకృష్ణారెడ్డి  

గుంటూరు: మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నందిగం సురేష్, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్తలు బాలసాని కిరణ్, గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్‌ తదితరులతో కలిసి గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇంటిలోని ఫర్నిచర్, రౌడీ మూక తగలబడిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఇంటిలోని వస్తువులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని పరిశీలించారు. 
అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..:

జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా తేలినా..:
    సీబీఐ సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్‌లో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఆరోపించినట్టుగా జంతువుల ఆవు, పంది కొవ్వు, చేపల నూనెల కలవలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు కూటమి నాయకులను తిట్టిపోస్తున్నారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్, ఇతర కూటమి నాయకులు చేసిన క్షుద్ర రాజకీయాలను చూసి చీదరించుకుంటున్నారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పథకం ప్రకారం దాడి చేశారు. సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌పై ప్రజల్లో చర్చ జరగకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా దాడికి టీడీపీ వ్యూహ రచన చేసి అమలు చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టుల ఆధారంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. 

వ్యూహాత్మకంగానే మా నాయకులపై వరుస దాడులు:
    ఇప్పటికైనా చంద్రబాబు, కళ్యాణ్‌ చేసిన పాపానికి ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం. అలా చేయకపోగా.. జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ నిజం అంటూ సిట్‌ రిపోర్టునే వక్రీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి ఇంకా వైయ‌స్ఆర్‌సీపీ మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై మా పార్టీ నాయకులు నిరసనకి దిగుతున్నారు. వివాదాస్పదమైన ఈ ఫ్లెక్సీలను తొలగించాల్సిన పోలీసులు, వాటికి కాపాలాగా నిలబడ్డారు.
    మా పార్టీ సీనియర్‌ నాయకుడు అంబటి రాంబాబు ఈ ఫ్లెక్సీలను తొలగించాలని, లేదంటే తానే స్వయంగా తీసేస్తానని హెచ్చరించాడు. దీన్నే ఆసరాగా తీసుకుని గుడికి వెళ్లి వస్తున్న అంబటిపై కూటమి నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. కొంతమంది మహిళలను ఉసిగొల్పి వారితో అంబటిని బూతులు తిట్టించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు. లడ్డూ విషయంలో కుట్రలు చేసి అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. ఈ దాడితో ఇష్యూను పక్కదారి పట్టించాలని చూశాడు. 
    అందులో భాగంగానే అంబటి రాంబాబు ఇంటిపై 2 వేల మంది గూండాలను పంపించి దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల సమక్షంలోనే జరిగినా అదుపు చేయడానికి ఎక్కడా ప్రయత్నించ లేదు. పైగా వివాదాస్పదంగా ఉన్న ఫ్లెక్సీలకు కాపాలాగా నిలబడటం సిగ్గుచేటు. సిట్‌ రిపోర్టు వచ్చిన క్షణం నుంచి పథకం ప్రకారమే దాడులకు తెగబడుతున్నారు.
    మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌ రెడ్డి మీద దాడి చేశారు. చివరికి అంబటి విషయంలో మరింత తీవ్రంగా రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే భర్త సహా పలువురు నాయకులు స్వయంగా దాడిలో పాల్గొన్నారు. 

పోలీసులు సమయానికి స్పందించి ఉంటే..:
    కూటమి నాయకుల కవ్వింపు చర్యలు సహనం కోల్పోయానని, తాను అలా మాట్లాడాల్సి ఉండాల్సిందని అంబటి రాంబాబు పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత ఇంకా రెట్టించి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుని ఉండాల్సింది. కానీ ఆయనపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అంబటి రాంబాబు భాష గురించి ప్రశ్నించేవారు 
వైయస్‌ జగన్‌ గారిని ఉద్దేశించి పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ సహా పలువురు టీడీపీ జనసేన నాయకులు తీవ్రమైన భాషతో దూషించారు. వాటిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?   వారు ఇప్పటికీ అలాగే దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. 
    సోషల్‌ మీడియా వేదికగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మీద బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటిపై ఆధారాలతో సహా పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. అంబటి రాంబాబు మీద జరిగిన హత్యాయత్నంలో ఎవరికైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? 
    శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు మీద జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయడానికి డీజీపీ, అడిషనల్‌ డీజీ, ఐజీ, ఎస్పీలకు కి ఫోన్‌ చేస్తే వారు సకాలంలో స్పందించలేదు. స్వయంగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత దీనిపై ఫిర్యాదు చేయడానికి ఎస్పీ ఇంటికి వెళ్తే 40 నిమిషాల పాటు గేటు బయట నిలబెట్టి అవమానించారు. అంబటిని తీసుకెళ్లిన తర్వాతే వారు లైన్‌లోకి వచ్చారంటే దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. పోలీసులు సమయానికి తగిన విధంగా స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. దాడిని ఆపాలనుకుంటే వారికి పది నిమిషాల కన్నా పట్టేది కాదు. 

అల్లర్లతో అశాంతిని సష్టించాలన్నదే చంద్రబాబు ఆలోచన:
    అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో అశాంతిని సృష్టించడమే చంద్రబాబుకి అలవాటు. గతంలో  మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పట్టాభితో వైయస్‌ జగన్‌ గారిని ఉద్దేశించి పదే పదే తీవ్రంగా తిట్టించాడు. స్వయంగా ఆయన, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడు సహా చాలా మంది ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్టీ కార్యకర్తలు ఆవేశపడిపోయి టీడీపీ ఆఫీసు మీద దాడికి దిగారు. కానీ పార్టీ నాయకులు ఎవరూ ఈ దాడిలో పాల్గొనలేదు. నాడు టీడీపీ గూండాల దాడిలో ఒక పోలీసు కన్నును కోల్పోయాడు. దాడి జరిగిన తీరును బట్టి అంబటి రాంబాబును చంపాలన్న కుట్రతోనే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రణాళిక ప్రకారమే రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
    టీడీపీ గూండాల దాడిపై వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌గానే ఫైట్‌ చేస్తుంది. పార్లమెంట్‌లో కూడా దీనిపై గళమెత్తుతాం. రాజ్యాంగ బద్దంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. ఈ వీడియోలన్నీ తీసిపెట్టుకున్నాం. దాడిలో ఎవరెవరు పాల్గొన్నారో అందరి పేర్లూ డిజిటల్‌ డైరీలో ఎక్కిస్తాం. నిందితులను చట్టపరంగా శిక్షించి తీరుతామని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top