అంబటి రాంబాబుపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే

పద్మావతీపురంలో భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన

తిరుపతి : మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పద్మావతీపురంలో భూమన కరుణాకర రెడ్డి నివాసం వద్ద రోడ్డుపై కూర్చుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ..“అంబటి రాంబాబుపై నిన్న జరిగిన దాడి ఒక వ్యక్తిపై కాదు… ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి” అని స్పష్టం చేశారు.

ఇరు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు, మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుపై దాడి అత్యంత హేయమైనదని, నీచమైన చర్య అని ఆయన మండిపడ్డారు.
“జల్లికట్టులో ఎద్దులు లాగా అంబటి ఇంటిపై ఎగబడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది రాజకీయ దాడి కాదు… ఇది హంతక ముఠా చర్య” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేసిన భూమన,
“వివరణ ఇచ్చినప్పటికీ ఆయన ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించడం పూర్తిగా దుర్మార్గం” అని అన్నారు.

రాంబాబుపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని,
“మాట తూలితే దానిపై వివరణ ఇచ్చారు. అయినా పోలీసుల సమక్షంలో ఇంత బరితెగించి దాడులు చేయడం దారుణం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో,
“ప్రతీకార రాజకీయాలతో రగిలిపోతూ, నిర్లక్ష్యంగా దాడులకు తెగబడటం రాష్ట్రానికి శాపం” అని అన్నారు. లడ్డూ వివాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి మండల కేంద్రంలో ఫ్లెక్సీలు పెట్టిస్తూ ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని,
“కాపు నాయకులపై లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది” అని భూమన కరుణాకర రెడ్డి ఆరోపించారు.
ఈ దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

Back to Top