అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయం

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజం

కృష్ణా జిల్లా పామర్రులో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని).

అంబటి రాంబాబుపై దాడి ప్రభుత్వం చేసిన కుట్ర

ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు భౌతిక దాడులు

తిరుమల లడ్డూ కేసులో అడ్డంగా దొరికిన బాబు

సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో బట్టబయలైన కుతంత్రం

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య స్పష్టీకరణ

పామర్రు:జగన్‌గారిని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలన్న దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వివాదాన్ని సృష్టించారని వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు కుట్ర బట్టబయలైందని, ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారని పేర్ని నాని వెల్లడించారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకు భౌతిక దాడులు చేసున్నారని, అంబటి రాంబాబుపై దాడి ప్రభుత్వ కుట్ర అని స్పష్టం చేశారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయమని కృష్ణా జిల్లా పామర్రులో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ధ్వజమెత్తారు.
ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..:

మరో కుట్రకు తెర ఎత్తిన ప్రభుత్వం:
    తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికలు, ఆ తర్వాత సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో కూడా అదే విషయం స్పష్టం చేయడంతో.. ఇన్నాళ్లూ దానిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దమని తేలిపోయింది. దీంతో మరో కుట్రకు తెర తీస్తూ రాష్ట్రంలో పలు చోట్ల.. అవే అసత్యాలు ప్రచారం చేస్తూ.. జగన్‌గారు, వైవీ సుబ్బారెడ్డి, భూమనకరుణాకర్‌రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేసిన తప్పు ఒప్పుకుని ప్రాయశ్చితం చేసుకోకుండా, నిస్సిగ్గుగా మళ్లీ ఎదురుదాడి చేయడం, అవే అసత్యాలు పదే పదే చెప్పడం దారుణం.

అంబటి రాంబాబు హత్యాయత్నం హేయం:
    ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఆలయంలో ప్రాయశ్చిత పూజ చేసి వస్తున్న అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు కర్రలు, రాడ్లతో సిద్దమై దాడికి ప్రయత్నించారు. దీంతో స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేసిన రాంబాబు ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. కానీ, ఆ తర్వాత ఏకంగా అంబటి రాంబాబు ఇంటిపై అన్ని ఏర్పాట్లతో దాడి చేసిన టీడీపీ మూకలు.. మొత్తం ధ్వంసం చేయడంతో పాటు, ఏకంగా ఆయనపై హత్యాయత్నం చేశాయి. అది కచ్చితంగా ప్రభుత్వ కుట్ర. నడిబజార్లో మాటలతో చెప్పలేని బూతులతో దుర్భాషలాడుతుంటే కాస్త గట్టిగా స్పందించిన ఆయన.. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడం ద్వారా సంస్కారయుతంగా వ్యవహరించారు. అయినా ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న లక్ష్యంతో అంబటి రాంబాబును హత్య చేయాలని చూశారు.

చంద్రబాబు వ్యాఖ్యలు సందేహాస్పదం:
    ఎన్నికల్లో గెలిచిన తర్వాత తిరుపతి వెళ్లిన చంద్రబాబు, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావునిస్తున్నాయి. శ్యామలరావును టీటీడీ ఈఓగా నియమించిన కొద్ది రోజులకే ఆయన నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే 8 ట్యాంకర్ల నెయ్యి వస్తే, నాణ్యత లేదన్న కారణంతో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. అలా వెనక్కు పంపిన 4 ట్యాంకర్లు తిరిగి పేరు మార్చుకుని వేరే ఇన్‌వాయిస్‌లతో తిరుమలకు రాగా, అదే నెయ్యి లడ్డూల్లో వాడారు. అదే విషయాన్ని సిట్‌ నివేదించింది.
    మరి ఇక్కడ ఆ ఘోర తప్పిదానికి బాధ్యులెవరు? ఎవరి హయాంలో అలా తిరస్కరించిన నెయ్యి తిరిగి వాడారు? చంద్రబాబుగారి హయాంలోనే కదా?. అంతే కాకుండా అదే డెయిరీకి నెయ్యి కాంట్రాక్ట్‌ కొనసాగించారు. మరి అలాంటప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్‌గారికి ఎలా అంటగడతారు?
    ఇప్పుడు అంబటి రాంబాబుగారిపై హత్యా యత్నం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించడం దారుణం. ఇంకా అలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీకి అండగా నిలబడ్డం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్ని నాని గుర్తు చేశారు.

Back to Top