దాడులతో ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు కుట్ర 

అందుకే మా ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడి 

మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టీకరణ

తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్‌.

దేవదేవుని లడ్డూపై దుష్ప్రచారం చేస్తుంటే ఊరుకోవాలా?  

అధికారమదంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు  

మాపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు

శాంతిభద్రతలు పరిరక్షించలేని చంద్రబాబు రాజీనామా చేయాలి

మాజీ మంత్రి జోగి రమేష్‌ డిమాండ్‌

తిరుపతి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్‌గారి నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, ఇళ్లపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పర్యటనలో జోగి రమేష్‌ ఉండగా, ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన, అక్కడే తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా జోగి రమేష్‌ ఏమన్నారంటే..:

భయపడం. ప్రశ్నించడం ఆపం:
    చేతిలో అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నాయకులను కొడతాం, తిడతాం, బాంబులేసి చంపుతాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అధికారమదంతో రెచ్చిపోతూ 20 నెలల కాలంలోనే ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారు. రెడ్‌ బుక్‌  రాజ్యాంగం పేరుతో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చేయాలే కానీ రాక్షసానందం కోసం మా ఇళ్లపై దాడులు చేసి తగలబెడితే సహించేది లేదు. వీటన్నింటికీ తప్పకుండా మూల్యం చెల్లించుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఇలాంటి దాడులకు భయపడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపడం అనేది జరగదు.

వికృత రాజకీయ క్రీడ:
    నేను లేని సమయం చూసి పెట్రోల్‌ బాంబులతో మా ఇంటి మీద దాడి చేసి భయాందోళన సృష్టించారు. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పారు. దీంతో దేవదేవుని లడ్డూని కల్తీ జరిగిందని ప్రచారం చేస్తున్న టీడీపీయే కల్తీ పార్టీ అని అనడం నేను చేసిన తప్పా?. వీధుల్లో ఫ్లెక్సీలు వేసి తప్పుడు ప్రచారంతో తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారి మీద పోలీసులు కేసులు ఎందుకు పెట్టడం లేదు?  పైగా వివాదాలు సృష్టిస్తున్న ఫ్లెక్సీలకు కాపలాగా నిలబడతారా?  వికృతమైన రాజకీయ క్రీడను ఇంతటితో ఆపేయాలి. లేదంటే మాదైన రోజున దీనికి ఖచ్చితంగా జవాబు చెబుతాం. 
    శాంతిభద్రతలు పరిరక్షించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. అక్రమ మద్యం కేసులో మూడు నెలలు జైలుకు పంపినా నాపై కోపం చల్లారినట్టు లేదు. తాను వైయస్సార్సీపీ జెండా పట్టుకోకుండా చేయాలనేది లోకేష్‌ లక్ష్యం అని, కానీ.. అది ఎప్పటికీ నెరవేరదని జోగి రమేష్‌ స్పష్టం చేశారు.

Back to Top