కొట్టేది, తిట్టేది వాళ్లే.. కేసు పెట్టేదీ వాళ్లే

చంద్ర‌బాబు నేతృత్వంలో రాష్ట్రంలో విచిత్ర‌మైన పాల‌న 

జ‌గ‌న్ పుట్టుక అంటూ నీచంగా మాట్లాడింది చంద్ర‌బాబే 

ఇలాంటి చంద్ర‌బాబు ఎవ‌రెలా మాట్లాడాలో చెబుతారా?  

కూట‌మి దాడుల‌పై మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ ధ్వ‌జం 

అనంత‌పురం: ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద కూట‌మి నాయ‌కులు దాడి చేసి మా మీద‌నే కేసులు పెట్టే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో సాగుతోందని, ఎలాంటి భాష‌ మాట్లాడాలో ఇత‌రుల‌కు నీతులు చెబుతూ వారు మాత్రం నీతిబాహ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ ధ్వ‌జ‌మెత్తారు. అనంత‌పురంలో పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ పుట్టుక గురించి నీచంగా మాట్లాడిన చంద్ర‌బాబుకి ఎవ‌రు ఎలా మాట్లాడాలో నిర్దేశించే హ‌క్కులేద‌ని చెప్పారు. మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై జ‌రిగిన దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. " టీడీపీ నాయ‌కులే స‌మాజానికి నీతులు చెబుతారు. వారే త‌ప్పులు చేస్తారు. వారే కేసులు పెడ‌తారు. వారి త‌ర‌ఫున ఎల్లో మీడియాలో విచార‌ణ చేస్తారు. వాళ్లే తీర్పులు కూడా చెబుతార‌"ని  విమ‌ర్శించారు. తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీకి వాడిన నెయ్యిలో పంది కొవ్వు క‌లిసింద‌ని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు, రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌న్న‌ దురుద్దేశంతో చేసిన‌వేన‌ని తేల‌డంతో టీడీపీ ప‌రువు పోయింద‌ని చెప్పారు. దీంతోపాటు లోకేష్ తోడ‌ల్లుడుకి చెందిన గీతం కాలేజీకి రూ. 5 వేల కోట్ల విలువైన భూములు క‌ట్ట‌బెట్ట‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్నారు. వీటికి స‌మాధానం చెప్పుకోలేక ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లను మ‌ళ్లించ‌డానికే ప‌థ‌కం ప్ర‌కారం అంబ‌టి రాంబాబుపై దాడి చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ వెన‌క్కిత‌గ్గ‌క‌పోవ‌డానికి కార‌ణం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన ఇంటిపై దాడి చేశారని, ఈ దాడులకు  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వ్యూహర‌చ‌న జ‌రుగుతోంద‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ ఆరోపించారు.

Back to Top