మరో మైలురాయిగా షర్మిల బస్సు యాత్ర

విజయనగరం, 14 సెప్టెంబర్ 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ‌అన్నారు. బస్సు యాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల ఈ నెల 15 ఆదివారం సాయంత్రం సాలూరులో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. శ్రీమతి షర్మిల బస్సు యాత్రకు సంబంధించి పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు,‌ శ్రీ జగన్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని సాంబశివరాజు పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్ర ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే కాంగ్రెస్ ‌నాయకులకు పట్టకపోవడం దారుణమని సాంబశివరాజు విమర్శించారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కు రాజకీయాల కారణంగానే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రజల మనోభావాలను గుర్తెరిగిన పార్టీగా‌ ప్రజల పక్షాన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి బాధల్లో భాగస్వాములయ్యేందుకు మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం మొత్తం పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే శ్రీమతి షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారని తెలిపారు.

పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ‌.. శ్రీమతి షర్మిల బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని కుట్ర పన్నిన కాంగ్రెస్, టిడిపి నేతలు నేడు ఉద్యమాల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ ప్రచార కార్యదర్శి గొర్లె వెంకటరమణ మాట్లాడుతూ సాలూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ గేదెల తిరుపతి, డాక్ట‌ర్ సురే‌ష్‌బాబు, అంబళ్ల అప్పల నాయుడు, ఇప్పిలి రామారావు, చెల్లూరు ఉగ్రనరసింగరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top