సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో రెండు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. అరెస్టు చేసిన తొంబై రోజుల గడువు లోపల దర్యాప్తు పూర్తిచేసి, బెయిలు ఇవ్వాలన్న స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ మొదటిది కాగా,  ఛార్జిషీటుకు సంబంధించిన సాధారణ బెయిలు పిటిషన్ రెండోది.  క్విడ్ ప్రో కో కేసులో ఈ పిటిషన్లు వేశారు. నిర్ణీత గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తిచేయలేదనీ, ఛార్జిషీటు దాఖలు చేయలేదనీ మొదటి పిటిషన్లో  పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట సీబీఐ విపరీతమై కాలయాపన చేస్తోందని అందులో ఆరోపించారు. సీఆర్పీసీ సెక్షన్ 167(2) ప్రకారం తనకు బెయిలు పొందే అర్హత ఉందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అరెస్టు చేసిన తొంబై రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అరెస్టు చేసి 90 రోజులు పూర్తయితే బెయిలు ఇవ్వాలని చట్టం చెబుతోంది. సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసే సమయానికి జగన్ అరెస్టయి తొంబై రోజుల గడువు పూర్తికాలేదు. అందుకే సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆ గడువు పూర్తికావడంతో జగన్ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.  ఇప్పటిదాకా జగన్ ఈ అంశంపై ఏ కోర్టులోనూ వాదనలు వినిపించలేదు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ ఈ
ఏడాది మే నెలలో విచారణ కోసమని పిలిచి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Back to Top