'సభను వాయిదా వేసి పారిపోతున్న ప్రభుత్వం'

హైదరాబాద్, 20 మార్చి 2013 : ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా వాయిదా వేసుకుని ‌రాష్ట్ర ప్రభుత్వం పారిపోతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుమ్మెత్తిపోసింది. సభలో ఎలాంటి చర్చా జరగకుండా అసెంబ్లీని ప్రభుత్వం గురువారానికి వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది. సభ వాయిదా పడిన అనంతరం పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే జి. గుర్నాథరెడ్డి మీడియాతో మాట్లాడారు.  తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టిఆర్ఎస్‌ సభ్యులు శాసనసభలో బుధవారం తీవ్ర గందరగోళ సృష్టించిన నేపథ్యంలో స్పీకర్‌ సభను గురువారానికి వాయిదా వేశారు.

శాసనసభలో ఏ ఒక్క ప్రధాన అంశంపైనా ఇంతవరకూ చర్చించలేదని పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. అసెంబ్లీని సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. భేషజాలు మానుకుని ప్రభుత్వం శాసనసభను సజావుగా నడిపించాలని కృష్ణదాస్‌, గుర్నాథరెడ్డి సూచించారు.
Back to Top