సామాన్యులపై భారాన్ని అంగీకరించం

హైదరాబాద్:

పన్నులు విధించి సామాన్య ప్రజలపై భారం మోపుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తేల్చి చెప్పింది. పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వం ముపై వేల కోట్ల రూపాయలను వసూలు చేసిందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

     ఆర్టీసీ ప్రయాణికుల నుంచి సేవా పన్నును వసూలు చేయాలన్న నిర్ణయంపై జనక్ ప్రసాద్ మండిపడ్డారు. కిరణ్ ప్రభుత్వం ఇప్పటివరకూ మూడు సార్లు ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై 1700 కోట్ల రూపాయల భారాన్ని మోపింది. తాజాగా మరింత భారాన్ని మోపవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్టీసీ నష్టాలు 4200 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని చెప్పారు. ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని మోపరాదని సూచించారు.

ఉచిత విద్యుత్తుపై సర్వీసు చార్జీకి నిరసన

     ఉచిత విద్యుత్తుపై సర్వీసు చార్జి చెల్లించాలని రైతులను బలవంతం చేయడంపై జనక్ ప్రసాద్ మండిపడ్డారు. ఈ అనాలోచిత నిర్ణయాలకు ప్రభుత్వం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే వందల కోట్ల రూపాయలను సర్చార్జీలు, ఇంధన సర్దుబాటు రూపంలో వసూలు చేశారన్నారు. ఇది చాలక సర్వీసు చార్జి చెల్లించాలని ఉచిత విద్యుత్తు పొందే రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు.

     వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను సిలిండరుకు యాబై రూపాయలు పెంచినపుడు ఆ భారాన్ని అప్పటి ప్రభుత్వం భరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలను ఆయన ఎన్నడూ పెంచలేదన్నారు. ఇప్పుడు ఆరు సిలిండర్లు వాడుకున్న వారు ఆపై వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోందని మండిపడ్డారు.

     రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సంస్థలాగా వ్యవహరిస్తోందనీ, లాభాపేక్షతో ఆలోచిస్తూ సంక్షేమ సూత్రాన్ని గాలికొదిలేసిందనీ జనక్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. కిరణ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విధానాలను అనుసరిస్తూ పన్నులను పెంచుతూ ప్రజలను భీతావహులను చేస్తోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో ప్రజాలు కిరణ్ ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పడం తథ్యమని ప్రసాద్ స్పష్టంచేశారు.

Back to Top