గాంధీ విగ్రహం వద్ద రోజా మౌనదీక్ష

హైదరాబాద్ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లారు. అసెంబ్లీ ఆవరణలో న్యాయం కోసం మౌనదీక్షకు దిగిన రోజా  ఆరోగ్యం నీరసించింది. దీంతో, ఆమెను నిమ్స్ కు తరలించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా.. తనను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ రెండోరోజు కూడా ఆర్కే రోజా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9 గంటల నుంచే రోజా మౌనదీక్ష చేపట్టారు. 

రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు రోజాకు మద్దతుగా నిలిచారు.  న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు రోజాను సభలోకి అనుమతించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల,లోపల న్యాయపోరాటానికి దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహిళా శాసనసభ్యురాలి పట్ల కక్షసాధింపునలకు పాల్పడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో న్యాయం కోసం ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలు..వాయిదా అనంతరం ఆమెకు సంఘీభావంగా గాంధీ విగ్రహం వద్దే కూర్చున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు  కూడా రోజాకు మద్దతు తెలిపారు. రోజాకు మద్దతుగా  రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

మరోవైపు , ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతూ ఇష్టారీతిన సభను నడుపుకోవడాన్ని మేధావులు తప్పుబడుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ రెండు సార్లు వాయిదా అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. 
Back to Top