ప్రతిపక్ష నేతకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

  • బాబు, మోడీ మెడలు వంచుతాం
  • రాష్ట్రానికి అన్యాయం చేసే మొదటి వ్యక్తి బాబే
  • పోలీసులు మీకు జీతాలిచ్చేది ప్రజలని గ్రహించాలి
  • అక్రమ అరెస్టులు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు
  • అన్యాయంగా  వైయస్‌ జగన్‌ వెహికిల్, డ్రైవర్, సిబ్బంది అరెస్ట్‌
  • ఎన్ని కుట్రలు పన్నినా.. వైయస్‌ జగన్‌ కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొని తీరుతారు
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలే కాదు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మెడలు కూడా వంచి సాధించుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హక్కు కోసం ప్రజలందరూ పోరాడుతుంటే చంద్రబాబు ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారని ధ్వజమెత్తారు. బ్రిటీష్‌ పాలనను తలపించే విధంగా హోదా కోసం రోడ్లమీదకు వచ్చిన వారిని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాల్లో అనేక ఉద్యమాలు జరిగాయి. రోడ్లమీదకు వచ్చి అనేక నిరసనలు చేశారు. అప్పుడెందుకు అరెస్టులు చేయలేదని చంద్రబాబును నిలదీశారు. ప్రత్యేక హోదా తమ హక్కు అని యువత, విద్యార్థులు న్యాయపరమైన పోరాటాలు చేస్తుంటే అణిచివేసే ప్రభుత్వానికి బ్రిటీష్‌ ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 

బాబూ నీకెందుకు భయం
రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందుకు హోదా కావాలని వైయస్‌ఆర్‌ సీపీ, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు పిలుపునిచ్చి స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తుంటే చంద్రబాబుకు ఎందుకు భయం అని అంబటి ప్రశ్నించారు. వైజాగ్‌ బీచ్‌లోకి ఉదయం నుంచి వాకర్స్‌ను కూడా వెళ్లకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి దాడులు, బెదిరింపులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బికినీ ప్రదర్శన కోసం ఇతర దేశాల నుంచి ప్రేమికులను పిలిపించొచ్చు కానీ హక్కు కోసం పోరాడుతుంటే బీచ్‌కు రానివ్వరా అని చంద్రబాబును నిలదీశారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు దేశం చూడలేదు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నారా?
ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని అణచివేస్తూ పోలీసులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసులు మీ జేబుల్లోకి వస్తున్న జీతం చంద్రబాబు ఖజానా నుంచి రావడం లేదు. ప్రజలు ట్యాక్స్‌ కడితేనే వస్తుందని గ్రహించాలని సూచించారు. సమాజానికి సేవ చేయాలని జీతాలు ఇస్తుంటే హోదా కోసం తపిస్తున్న ప్రజలను అన్యాయంగా అరెస్టులు చేస్తారా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పోలీస్‌ ఉన్నతాధికారులు పదవులు శాశ్వతం కాదు సక్రమంగా వ్యవహరించండి అని హితవు పలికారు. అక్రమంగా అరెస్టులు, దాడులు చేస్తే చంద్రబాబును, పోలీసులను కోర్టుల్లో నిలవేస్తామని హెచ్చరించారు. అన్యాయంగా హోదా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే బంతిని నేలకు కొడితే ఎంత వేగంగా పైకి లేస్తుందో అదే విధంగా హోదా ఉద్యమం మరింతగా ముందుకు వెళ్తుందని చంద్రబాబుకు సూచించారు. 

ప్రతిపక్షనేతను అడ్డుకుంటారా?
ప్రత్యేక హోదా కోసం సాగుతున్న క్యాండిల్‌ ర్యాలీలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటానని ప్రకటించి, వైయస్‌ జగన్‌ బుల్లెట్‌ ఫ్రూవ్‌ వాహనాన్ని వైజాగ్‌కు పంపిస్తే చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ఆ వెహికిల్‌ను, డ్రైవర్‌ను, సిబ్బందిని అక్రమంగా అరెస్ట్‌ చేసి నిర్భందించిందని అంబటి రాంబాబు ఫైరయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో మీరిచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబును నిలదీశారు. విధ్వంసాలు జరుగుతాయని కుంటిసాకులు చెప్పడం సబబు కాదన్నారు. విజయనగరంలో రైలు ప్రమాదంతో విధ్వంసం జరిగింది అలాగని రైల్లు ఆపేస్తారా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామని వైయస్‌ జగన్‌ ప్రకటించి అఫిడవిట్‌ కూడా ఇచ్చి వైజాగ్‌కు వెళ్తుంటే భారతరాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం ఒక్కటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన అని స్పష్టం చేశారు. చంద్రబాబు అన్యాయాలకు, అక్రమాలకు భయపడి వెనుదిరిగే ప్రసక్తే లేదని అంబటి పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. అంతం కాదు. మరింత ఉద్యమ రూపాన్ని ఇచ్చి వైయస్‌ఆర్‌ సీపీ ముందుకు వెళ్తుందని హెచ్చరించారు. ఎన్ని నిర్భందాలు చేసినా, అక్రమ అరెస్టులు చేసినా వైయస్‌ జగన్‌ వైజాగ్‌కు వెళ్తారు, కొవ్వత్తుల ప్రదర్శనలో పాల్గొని తీరుతారని స్పష్టం చేశారు. కొవ్వత్తుల నిరసనలో మరింత ఉత్సాహంగా రాష్ట్ర యువత, విద్యార్థులు అందరూ ఒక్క తాటిపై నడవాల్సిన అవసరం ఉందని అంబటి పునర్ఘుటించారు. వైజాగ్‌లో ఏ సంఘటన జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 

 
Back to Top