ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీలో తీర్మానం

హైదరాబాద్, 1 జూలై 2013: 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ ప్లీనరీ ప్రజాప్రస్థానంలో దాదాపు 20 కి పైగా తీర్మానాలు ప్రవేశపెడతామని పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వీటిలో ప్రధానంగా ఆర్థిక, రాజకీయ తీర్మానాలతో పాటు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని 14 నెలల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించి వైనం పైనా తీర్మానం చేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రజా హిత కార్యక్రమాల గురించి, కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందీ ఆ తీర్మానాల్లో ప్రతిపాదిస్తామని చెప్పారు.‌ ఈ నెల 8వ తేదీన వైయస్‌ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలోని రాజశేఖరరెడ్డి ప్రాంగణంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఉమ్మారెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో కాసేపు ముచ్చటించారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, జలయజ్ఞంపైన ప్లీనరీలో తీర్మానాలు ప్రతిపాదిస్తామని ఉమ్మారెడ్డి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగులు, మహిళలు, వృద్ధులు, చేనేత వర్గాల సంక్షేమంపై ఒక తీర్మానం ఉంటుందన్నారు. కొత్త మద్యం పాలసీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆభాసుపాలు చేస్తున్నదో, మద్యాన్ని ఆర్థిక వనరుగా ఏ విధంగా చూస్తున్నదో దీని మీద కూడా ఒక ప్రత్యేక తీర్మానాన్ని పార్టీ ప్లీనరీలో పెడతామన్నారు. అలాగే ఐటి రంగ విస్తరణ ఆవశ్యకత, యువత ప్రాధాన్యత, మహిళా సంక్షేమం తదితర అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించిన అంశాలపైన తీర్మానాలు ప్రవేశపెడతామని ఉమ్మారెడ్డి వివరించారు.

ప్లీనరీ సందర్భంగా శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిలమ్మ చేపట్టిన కార్యక్రమాలను ఈ ప్లీనరీ సందర్భంగా ప్రజల ముందు ఉంచుతామని ఉమ్మారెడ్డి వివరించారు. ప్రజా సమస్యలపై గడచిన రెండేళ్ళుగా పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు, నిరాహార, నిరసన దీక్షల వివరాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న సుమారు 9 వేల మందిని ఆహ్వానించినట్లు ఉమ్మరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆహ్వానపత్రాలు అన్ని జిల్లాలకూ వెళ్ళిపోయాయని చెప్పారు. ప్లీనరీ రోజున ఉదయం 8 గంటలకే‌ ఇడుపులపాయలోని 'రాజశేఖరరెడ్డి ప్రాంగణా'నికి చేరుకోవాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

Back to Top