బాబు హయాంలో అన్యాయంపై చర్చకు సిద్ధం

హైదరాబాద్, 3 డిసెంబర్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు హయాంలోనే కృష్ణా జలాలపై అన్యాయం జరిగిందని పార్టీ నాయకులు గుర్నాథ్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు విమర్శించారు. కృష్ణా జలాలకు సంబంధించి జరిగిన అన్యాయంపై చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు.‌ 2000వ సంవత్సరంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే మిగులు జలాలపై హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనికి చంద్రబాబు బాధ్యుడు కాదా? అని వారు ప్రశ్నించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ లేఖ వల్లే వ్యతిరేక తీర్పు వచ్చిందంటూ ఊరికే విమర్శించడం కోసం ఇతరుల మీద నిందలు చేయడం మాని ఆ రోజు మిగులు జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెల్లడించాలని సూచించారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీలో చెప్పిన అంశాలన్నింటినీ బయటికి తీయాలన్నారు.

బచావత్ అవార్డు నుంచి బ్రిజే‌ష్ కుమార్ తీర్పు వరకూ చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని ‌ఉమ్మారెడ్డి, గుర్నాథ్‌రెడ్డి, గట్టు సవా‌ల్ విసిరారు. ముగ్గురు రిటైర్డు ఇంజినీర్ల ఆధ్వర్యంలో బ్రిటిష్‌ వారి హయాం నుంచీ కృష్ణా జలాల వినియోగంపై సవివరమైన చర్చకు దమ్ముంటే టీడీపీ ముందుకు రావాలని సవాల్‌ చేశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ వచ్చే నాటికే మన రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఇప్పుడు ఈ వివాదం వచ్చేదే కాదని ఉమ్మారెడ్డి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లు కూడా చంద్రబాబు రద్దుచేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వారు దుమ్మెత్తిపోశారు. ‌కృష్ణా జలాలు కోల్పోవడానికి కారణమైన ఆల్మటి ప్రాజెక్టు ఎత్తును పెంచింది బాబు హయాంలోనే అని పార్టీ నాయకులు గుర్తుచేశారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని, దానిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉమ్మారెడ్డి స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top